బోనకల్లు, ఆగస్టు 23 : ఖమ్మం జిల్లా బోనకల్లు మండల పరిధిలోని చిరునోముల గ్రామంలో అసైన్డ్ భూముల నుండి దర్జాగా మట్టి అక్రమ తోలకాలు సాగుతున్నాయి. ఈ మట్టి తోలకాలపై సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారుల అనుమతి లేకుండా ట్రాక్టర్లతో తోలకాలు జరుపుతూ పలువురు అక్రమార్జనకు తెరలేపారు. అనుమతులు లేని తోలకాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఈ అక్రమ తోలకాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ట్రక్కు మట్టి సుమారు రూ.1,500 వరకు విక్రయిస్తూ యదేచ్చగా మట్టి తోలకాలు జరుపుతున్నారు. అధికారుల పర్యవేక్షణ చర్యలు కొరవడడం వల్లే ఈ మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Bonakal : అసైన్డ్ భూముల నుండి మట్టి అక్రమ తోలకాలు.. పట్టించుకోని అధికారులు