కారేపల్లి, ఆగస్టు 4: ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని బాజు మల్లాయిగూడెం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతుంది. సుమారు ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో రాత్రి వేళల్లో ఆకతాయిల వికృతచేష్టలకు వేదికగా మారింది. నాలుగున్నర దశాబ్దాల కింద ఇక్కడ ప్రభుత్వం పాఠశాలను నిర్మించింది. 1986 నుండి పదో తరగతి వరకు అప్గ్రేడ్ అయింది. నాటినుంచి వేలాదిమంది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సరస్వతీ నిలయంగా ఉన్న ఈ పాఠశాల భవనానికి రక్షణ కరువైంది. రాత్రి వేళలు, పాఠశాల సెలవు దినాల్లో పరిసర ప్రాంత గ్రామాలకు చెందిన వారు మద్యం సేవించి సీసాలను పగలగొట్టి ఆవరణలో చిందరవందరగా పడేస్తున్నారు. దీంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సీస ముక్కలు గుచ్చుకొని గాయాలైన సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి.
ప్రహరీ గోడ లేకపోవడం వల్లే..
పాఠశాల భవనం చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతోనే అసాంఘిక శక్తులకు స్థావరంగా మారిందని ప్రధానోపాధ్యాయుడు వేణుమాధవ్ అన్నారు. రాత్రి వేళల్లో ఆకతాయిలు పాఠశాలలో మద్యం సేవిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు, విద్యాశాఖ అధికారులు, గ్రామస్తుల దృష్టికి కూడా తీసుకువెళ్లామని చెప్పారు.
ఎంతోమంది విద్యార్థులు తీర్చి దిద్దిన బడి
మా ఊరి బడి ఎన్నో వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దిందని స్వయం సహాయక సంఘ సభ్యురాలు తాటికొండ రాణి అన్నారు. ఉన్నది మారుమూల గ్రామంలోనైనా ప్రతి ఏడాది 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి.