భద్రాచలం, జనవరి 9 : పట్టణంలోని గిరిజన గురుకుల విద్యాసంస్థలో నిర్వహిస్తున్న ఇగ్నైట్ ఫెస్ట్ మంగళవారం రెండో రోజుకు చేరింది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన 1,500 మంది బాలబాలికలకు ఇగ్నైట్ ఫెస్ట్‌లో భాగంగా యూత్ పార్లమెంట్, యూఎన్వో, ఫ్లోర్ ఆర్ట్, స్పెల్ బీ, ఫ్యాషన్ షో, వ్యాసరచన, వక్తృత్వ, స్పాట్ డ్రాయింగ్, వీడియో మేకింగ్, స్టోరీ, టెల్లింగ్, సైన్స్ ఫెయిర్, పాటలు, గ్రూప్ డాన్స్ తదితర 28 అంశాల్లో పోటీలు నిర్వహించారు. కాగా.. పోటీల్లో విజయం సాధించిన బాలబాలికలకు పారితోషికంతోపాటు ప్రశంసా పత్రాలు, ట్రోఫీ లు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రీజియన్లలో నిర్వహించిన ఇగ్నైట్ ఫెస్ట్‌లో పాల్గొని విజయం సాధించిన బాలబాలికలు స్టేట్‌మీట్‌లో పాల్గొనడంతో పోటీ ఆసక్తికరంగా సాగుతోంది.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గిరిజన గురుకులాల డిప్యూటీ సెక్రటరీ ఎం.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇగ్నైట్ ఫెస్ట్ గిరిబిడ్డలకు ఎంతో విజ్ఞానాన్ని పెంచుతుందన్నారు. ఇలాంటి పోటీ ల్లో పాల్గొనడం ద్వారా బాలబాలికల్లో మరింత సృజనాత్మకశక్తి పెరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో గిరిజన గురుకులాల ఓఎస్డీ సీఈఎస్ సుమలత, భద్రాచలం గురుకుల ఆర్సీవో వెంకటేశ్వరరాజు, వరంగల్ ఆర్సీవో డీఎస్.వెంకన్న, భద్రాచలం గిరిజన గురుకుల ప్రిన్సిపాల్ మెండెం దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.