ఖమ్మం/ ఖమ్మం కల్చరల్/రఘునాథపాలెం, మే 14: శ్రీరామ భక్తాగ్రేసరుడు ఆంజనేయస్వామి జయంతి సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హనుమజ్జయంతి ఉత్సవాలను ఆదివారం భక్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి విగ్రహావిష్కరణలు, అన్నదానాలు ఘనంగా జరిగాయి. హనుమాన్ చాలీసాలు, పంచామృత అభిషేకాలు, విశేష పూజలు చేసి తరించారు. జిల్లా వ్యాప్తంగా గల పలు ఆంజనేయస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పలు ఆంజనేయస్వామి ఆలయాల్లో స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంజనేయస్వామి కరుణా కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని అన్నారు. స్వామిని సేవిస్తే సకల సౌభాగ్యాలు చేకూరుతాయని అన్నారు. భక్తులు తులసీదళాలు, సింధూరం, తమలపాకులు, వడమాలలు, పంచామృత రసాలతో స్వామికి అభిషేకం చేసి తరించారు. ఖమ్మంలోని ప్రభాత్టాకీస్ రోడ్డు శ్రీభక్తాంజనేయస్వామి ఆలయంలో అర్చకుడు గట్టు హరీశ్ అత్యంత శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించారు. మూడువేల మంది భక్తులకు అన్నదానం చేశారు. గాంధీచౌక్ శ్రీవీర బాలాంజనేయ స్వామి ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహనరావు, ముడుంబై పవన్‌కుమార్, వల్లాల విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. అదేవిధంగా మధ్య గేటు ఆంజనేయస్వామి, వైరా రోడ్డు జలాంజనేయ స్వామి ఆలయం, కాల్వొడ్డు ఆంజనేయస్వామి ఆలయాల్లో హనుమజ్జయంతి ఉత్సవం వైభవంగా నిర్వహించారు.
విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి అజయ్..
నగరంలోని బైపాస్‌రోడ్డు 10వ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆంజనేయస్వామి విగ్రహాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆవిష్కరించారు. యాగశాలలో నిర్వహించిన క్రతువులో పూజలు చేశారు. స్వామిని వడమాలలు, తమలపాకులతో ప్రత్యేక అలంకరణ చేశారు. సుమారు 30 వేల మంది భక్తులకు మహా అన్నదానం చేశారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. కార్పొరేటర్ చావా మాధురీ నారాయణరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కార్పొరేటర్లు రమాదేవి, సతీశ్, బీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, కిశోర్‌బాబు, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పర్ణశాలలోని ఆంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. వైఎస్ఆర్ నగర్ కాలనీలో స్వామి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.