ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సీ-విజిల్ యాప్ పౌరుల చేతులో బ్రహ్మాస్త్రంగా మారింది. ప్రస్తుతం అధికారులు ఈ యాప్‌ను ఆధునీకరించి ఫ్లయింగ్స్కాడ్తో అనుసంధానం చేశారు. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను యాప్‌లో అప్లోడ్ చేస్తే నిమిషాల వ్యవధిలో ఎన్నికల అధికారులు స్పందిస్తారు. ఫిర్యాదుపై దర్యాప్తు చేయనున్నారు. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల జరుగుతున్న కోడ్ నిబంధన ఉల్లంఘనను పొందుపరచవచ్చు.
-భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ సత్తుపల్లి, అక్టోబర్ 12
భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ సత్తుపల్లి, అక్టోబర్ 12:ఎన్నికల వేళ పొరపాట్లు దొర్లకుండా ఉండేందుకు, ఎన్నికల కోడ్‌ను ఎవరైనా ఉల్లంఘిస్తే వెంటనే ఆ సమాచారాన్ని తెలియజేసేందుకు అందరికీ అందుబాటులోకి వచ్చేసింది ‘నిఘానేత్రం’. అదే ‘సీ విజిల్’ యాప్. పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రంగా ఉన్న మొబైల్ అప్లికేషన్.. ఫ్లయింగ్స్కాడ్తో అనుసంధానమై ఉంటోంది.
ఎక్కడైనా, ఎవరైనా పొరపాటు చేస్తే దాని గురించి వెంటనే యాప్‌లో నేరుగా ఫిర్యాదు చేసేలా వెసులుబాటు కల్పించింది ఎన్నికల సంఘం. తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల అభ్యర్థులు, నాయకులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే వాటిపై నేరుగా సామాన్య పౌరులు కూడా ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం అధికారులు ఈ యాప్‌ను రూపొందించారు. అలాగే ఎన్నికల ప్రచార సమయంలో అనుమతులు లేకుండా లౌడ్ స్పీకర్లు వాడినా, ఇతర నిబంధనలను ఉల్లంగించినా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
కుల, మతాలను రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేసినా, అనుమతులు లేకుండా ఎన్నికల ర్యాలీలు తీసినా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే వెసులుబాటును కల్పించారు. స్మార్ట్ఫోన్లు ఉన్నవారు ఈ యాప్‌ను గూగూల్ ప్లేస్టోర్ల నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎన్నికలు జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల జరుగుతున్న కోడ్ నిబంధనల ఉల్లంఘనలను పొందుపర్చవచ్చు. ఈ యాప్ ద్వారా ఫిర్యాదు అందిన తర్వాత 10 నిమిషాల వ్యవధిలోనే ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని తగిన చర్యలు తీసుకుంటారు.
స్మార్ట్ఫోన్లలో ‘ సీ విజిల్’ యాప్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి కోడ్ ఉల్లంఘటనలపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ప్లే స్టోర్‌కు వెళ్లి సీ విజిల్ యాప్ అని టైప్ చేస్తే 8.41 ఎంబీ ఉన్న ఈ యాప్ డౌన్లోడ్ అవుతుంది. అనంతరం భాషను ఎంచుకోమని వినియోగదారుడికి సూచిస్తుంది. భాషను ఎంచుకున్న అనంతరం వివిధ నిబంధనల తెలియజేసి అంగీకరిస్తున్నట్లుగా టిక్ చేయమని సూచిస్తుంది. అనంతరం ‘సీ విజిల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ అనే యాప్ సెల్‌ఫోన్ స్క్రీన్‌పైకి వస్తుంది. ఆ తర్వాత వినియోగదారుడి సెల్‌ఫోన్ నంబర్ ఎంటర్ చేయమని సూచిస్తుంది.
సెల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సంబంధిత సెల్ నంబర్‌కు ఎలక్షన్ కమిషన్ నుంచి ఎస్ఎంఎస్ ద్వారా 4 నంబర్లు గల ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన అనంతరం వినియోగదారుడికి సంబంధించిన పూర్తి వివరాలు సెల్ నంబర్‌పై ఉన్న పూర్తి వివరాలు, వినియోగదారుడి అడ్రస్, పిన్‌కోడ్ నంబర్, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం వంటి పూర్తి వివరాలు పొందుపర్చబడుతాయి.
అనంతరం యాప్‌లో వినియోగదారుడి వివరాలు ఓపెన్ అయ్యి ఫొటో, వీడియో, ఆడియో అనే మూడు లోగోలు కన్పిస్తాయి. వినియోగదారుడు తన ప్రాంతంలో జరిగిన కోడ్ ఉల్లంఘటనలపై ఫొటో లేదా వీడియో లేదా ఆడియో రూపంలో లోగోను బట్టి ఎంచుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ అయిన అనంతరం పంపిన ఫిర్యాదు నేరుగా ఎన్నికల సంఘానికి చేరుతుంది. ఎన్నికల సంఘం పరిశీలించిన అనంతరం సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారికి, లేదా కలెక్టర్‌కు, లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేర్చి పరిష్కరించే దిశగా తక్షణ చర్యలు చేపడతారు.
ఎన్నికల సమయంలో సీ విజిల్ యాప్ నిఘా కెమెరాలా పనిచేస్తుంది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. అధికార దుర్వినియోగం చేసిన ఎవరి మీదైనా ఫిర్యాదు చేయవచ్చు. ఓటర్లకు డబ్బులు ఇచ్చినా, మభ్యపెట్టినా పనిష్మెంట్ అవుతుంది. వీడియో లేదా ఫొటోలను వెంటనే ఈ యాప్‌లో అప్లోడ్ చేసి లొకేషన్ పెడితే చాలు మన ఫిర్యాదు అధికారులకు చేరుతుంది. వారు వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటారు.
-కొర్రా హుస్సేన్, సూరారం, జూలూరుపాడు
సీ విజిల్ యాప్ ఉంటే మన చేతిలో వజ్రాయుధం ఉన్నట్లే. ఎక్కడ అవినీతి జరుగుతున్నా దానిని వెంటనే స్మార్ట్ఫోన్లలో బంధించి ఈ యాప్‌లో అప్లోడ్ చేస్తే చాలు అధికారులు రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదు అందిన పది నిమిషాల వ్యవధిలోనే ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటారు. మా కాలేజీలో కూడా ఈ యాప్ గురించి అవగాహన కల్పించారు.
-జూపాక రాగమయి, ఎంబీఏ విద్యార్థిని, కొత్తగూడెం