రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలు వారివి.. నిలువ నీడలేక ప్రభుత్వ భూముల్లో నివాసం.. దశాబ్దాల నుంచి అదే ఇంట్లో పిల్లాపాపలతో తల దాచుకుం టున్నారు.. పేరుకు ఇల్లు ఉంది గానీ అది ఎలాంటి అక్కరకు రాదు. ఇంటిని చూసి అప్పు ఇచ్చే వారు కూడా ఉండరు. ఇండ్ల పట్టా పొందడం వారి చిరకాల వాంఛ. వారి సమస్యను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ యాజమాన్య హక్కులు కల్పించాలని నిర్ణయించారు. ఇండ్ల క్రమబద్ధీకరణకు మూడు నెలల క్రితం 58, 59 జీవోలు జారీ చేశారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 13,517 మంది దరఖాస్తులు చేసుకోగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని ఖమ్మం నగరంలో 2,309 మందికి పట్టాలు పంపిణీ చేశారు. అర్బన్ మండలంలో మరో 533 పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇతర మండలాల పరిధిలోని మిగతా దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. దరఖాస్తులపై క్షేత్రస్థాయికి వెళ్లి విచారిస్తున్నారు. అర్హులందరికీ త్వరలో పట్టాలు అందనున్నాయి.
ఖమ్మం, మే 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లాలో ఇండ్ల స్థలాల క్రమబద్ధీరణ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది. ప్రభుత్వ స్థలాల్లో దశాబ్దాల క్రితం ఇండ్లు నిర్మించుకున్న వారికి యాజమాన్య హక్కులు కల్పించేందకు ప్రభుత్వం 58, 59 జీవోలు తీసుకొచ్చింది. మూడు నెలలుగా ఎంతోమంది క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకున్నారు. తాజాగా దరఖాస్తు గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 13,517 మంది దరఖాస్తులు చేసుకోగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేక చొరువ తీసుకుని 2,309 మంది పట్టాలు పంపిణీ చేశారు. ఖమ్మం అర్బన్ మండలంలో మరో 533 పట్టాలు పంపిణీకి సిద్ధం గా ఉన్నాయి. ఇతర మం డల్లాల పరిధిలోని మిగతా దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. దరఖాస్తులపై క్షేత్రస్థాయికి వెళ్లి విచారిస్తున్నారు.
క్షేత్రస్థాయిలోకి వెళ్లి..
గత ప్రభుత్వాలు ఇండ్ల క్రమబద్ధీకరణ అంశాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని ఫిబ్రవరిలో మంత్రివర్గ ఉప సంఘం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ అసైన్డ్ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న పేదలకు యాజమాన్య హక్కులు కల్పించాలని నిర్ణయించారు. ఈమేరకు 58, 59 జీవోలు జారీ చేశారు. 58 ఉత్తర్వుల ద్వారా 125 చదరపు గజాల స్థలంలో నివసించే వారి ఇండ్లను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని ప్రకటించారు. 59 ఉత్తర్వుల ప్రకారం 125 గజాలకు మంచి ఉన్న స్థలాలను క్రమబద్ధీకరిస్తామన్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ క్రమబద్ధీకరణ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించి అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఇండ్లను పరిశీలించారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహించి అర్హులకు పట్టాలు అందజేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కలెక్టర్ వీపీ గౌతమ్ నేతృత్వంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రెండుసార్లు గడువు పెంచి మరింతమందికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. నిబంధనలను సరళతరం చేసింది. 125 గజాలలోపు ఇండ్లను ఉచితంగా క్రమబద్ధీకరిస్తున్నది. ఈనెలాఖరు వరకు దరఖాస్తుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పట్టా వస్తదని ఉహించలేదు..
మేం ఎన్నో ఎండ్ల క్రితం ఇండ్లు కట్టుకున్నాం. పేరుకు ఇల్లే గానీ ఎందుకూ పనికొచ్చేది కాదు. అవసరమైనప్పుడు అప్పు కూడా పుట్టేది కాదు. ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..’ అన్నట్లుగా మా జీవితాలు బాగు పడలేదు. సీఎం కేసీఆర్ దయ, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కృషితో పట్టాలు వచ్చాయి. పట్టా వస్తదని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు మా కంటూ ఆస్తి ఉన్నదనే ధైర్యం కలిగింది.
– దాసరి రవి, పువ్వాడ అజయ్‌నగర్, ఎన్నెస్పీ క్యాంప్
పేదల కల సాకారం
పేదల కలలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పిస్తున్నది. నగరంలో ఇప్పటికే వేలాది మందికి పట్టాలు అందజేశాం. దశాబ్దాల నాటి కలను సాకారం చేశాం. అర్హులైన ప్రతిఒక్కరికీ పట్టా ఇస్తాం.
-రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
58, 59 జీవోలతో మేలు..
పట్టా వచ్చిన తర్వాతే మాకంటూ ఆస్తి ఉందని అనిపిస్తున్నది. పట్టా మా కుటుంబానికి ఎంతో భరోసానిచ్చింది. ధైర్యాన్నిచ్చింది. గతంలో పట్టా లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. నాలాంటి వారెంతోమంది నానా అవస్థలుపడ్డారు. 58, 59 జీవోలు వేలాది మంది కలను నెరవేరిచంది.
– బొల్లం నర్సింహారావు, పువ్వాడ అజయ్‌నగర్, ఎన్నెస్పీ క్యాంప్
Khammam6