మూగజీవాలకు రోగం వస్తే ఎవరికీ చెప్పుకోలేవు. అడ్డంపడితే తప్ప వాటికి జబ్బు చేసిన సంగతి యజమానులకు తెలియదు. అప్పటికప్పుడు ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి. ఉదయం పదిగంటలు దాటితే తప్ప ఆసుపత్రులకు డాక్టర్లు రారు. తీరా సర్కారు పశువైద్యశాలకు వెళ్తే అక్కడ మందులు ఉండడం లేదు. దీంతో పశువుల యజమానులు సొంత డబ్బులతో బయట మందులు కొనుక్కొని వచ్చి మరీ వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి. జిల్లాలోని అన్ని పశువైద్యశాలల్లో ఇదే పరిస్థితి. ఆసుపత్రులు, సబ్సెంటర్లలో మందులు లేకపోవడంతో వైద్యులు, వెటర్నరీ అసిస్టెంట్లు పశువులు యజమానులకు బయటకు చీటీలు రాస్తున్నారు. భద్రాచలం, ఇల్లెందుల్లో మరీ దారుణం. ఏడీ స్థాయి ఆసుపత్రులు ఉన్నా వైద్యులు లేడు. సరైన వైద్యం అందకపోవడంతో మూగజీవాలు నరకయాతన అనుభవిస్తున్నాయి.
-భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 8 (నమస్తే తెలంగాణ)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 80 పశు వైద్యశాలలు ఉన్నా అందులో 40 ఆసుపత్రులు పాతవే శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో ఉన్న వైద్యులు తప్పని పరిస్థితుల్లో అక్కడకు వెళ్లి విధులు నిర్వహిస్తున్నారు. ప్రాథమిక వెటర్నరీ ఆసుపత్రులు 30 ఉండగా, ఏడీ స్థాయి ఆసుపత్రులు 6, సబ్‌సెంటర్లు 44 ఉన్నాయి. ఇందులో అన్ని ఆసుపత్రులు శిథిలావస్థకు చేరుకోవడంతో అక్కడ సిబ్బంది కూడా పనిచేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. వర్షం వస్తే కురవడంతోపాటు పురాతన భవనాలు ఉండటం వల్ల పశువుల యజమానులు ఆసుపత్రికి తీసుకెళ్లడానికి కూడా ఇబ్బందుల పడుతున్నారు. వెటర్నరీ అసిస్టెంట్లను బతిమిలాడుకుని ఇంటి వద్దకే పిలుచుకుని ప్రైవేటు మందులు కొనుగోలు చేసుకుని వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది.
సీజన్ వస్తే గురక వ్యాధికి వ్యాక్సిన్ వేయడం తప్ప ఇతర వ్యాధులు వచ్చినా, ప్రమాదాలు జరిగినా, పాములు కరిచినా మందులు లేకపోవడంతో ప్రైవేటును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పశువుల యజమానులు ఆరోపిస్తున్నారు. ఏడీ స్థాయి ఆసుపత్రులు కూడా బూర్గంపాడు, ఇల్లెందు ఆసుపత్రులు శిథిలావస్థలో ఉన్నాయి. భద్రాచలం, పాల్వంచ ఆసుపత్రుల్లో అసలు వైద్యులే లేరు. అక్కడ కాంపౌండర్లే వైద్యం చేయాలి. ఎక్కువ శాతం ప్రతి ఇంట్లో పెంపుడు కుక్కలు ఎక్కువగానే ఉన్నాయి. వాటికోసం యజమానులు వస్తే వ్యాక్సిన్ కోసం బయటకు పరుగులు తీయాల్సి వస్తుందని యజమానులు వాపోతున్నారు. ఇక పశువుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వైద్యం చేయించలేక కబేళాలకు తరిలించే పరిస్థితి వస్తుందని రైతులే చెప్పకనే చెబుతున్నారు.
సదుపాయాలు కరవు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 80 పశువైద్యశాలలు ఉండగా.. అందులో 40 ఆసుపత్రులు మరమ్మతులకు గురయ్యాయి. ఎర్రగుంట, కొమ్ముగూడెం, అన్నపురెడ్డిపల్లి, సంగెం ఆసుపత్రులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇందులో 30 ప్రాథమిక వెటర్నరీ ఆసుపత్రుల్లో కొమరారం డాక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. భద్రాచలం, పాల్వంచ ఏడీ స్థాయి పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. సబ్ సెంటర్లలో 5 పోస్టులు ఖాళీగా ఉండటంతో అక్కడ వెటర్నరీ సిబ్బందినే ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు. వానొస్తే కురవడం, పైన పెచ్చులు ఊడిపోవడంతో ఎప్పుడు కూలిపోతాయా అని అటు సిబ్బంది, అటు పశువుల యజమానులు కూడా భయపడే పరిస్థితి నెలకొంది. పినపాకలో 1962 వాహనం డ్రైవర్ లేక మూలనపడింది. దీంతో అక్కడ మొబైల్ వైద్యం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
ఆసుపత్రిలో మందుల్లేవు..
పశువులను ఆసుపత్రికి తీసుకెళ్తే మందుల చీటీ బయటకు రాస్తున్నారు. ఆసుపత్రిలో మందులు లేవు.. సౌకర్యాలు అసలే లేవు.. ఎప్పటినుంచో శిథిలావస్థలో ఉంది. పట్టించుకునే వారు లేరు. మూగజీవాలకు వైద్యం అందకపోతే ఎలా? ప్రభుత్వం నుంచి మందులు రావడం లేదని డాక్టర్లు చెబుతున్నారు. జబ్బులు వస్తే మందులు లేకపోతే వైద్యం ఎలా చేస్తారు.
– కలకొండ శ్రీనివాసరావు, ఎర్రగుంట, అన్నపురెడ్డిపల్లి మండలం
పేరుకే సబ్‌సెంటర్
పేరుకే సబ్‌సెంటర్.. ఇక్కడ మందులు ఉండవు. వైద్యం ఉండదు. మూగజీవాలకు రోగం వస్తే మా జేబులు ఖాళీ అవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నా మందులు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. సమయానికి మందులు ఇచ్చేలా పై అధికారులు చర్యలు తీసుకోవాలి. పాల ఉత్పత్తులు కావాలి అంటారు.. కానీ, పశువులకు వైద్యం ఉండదు. వైద్యులు ఉన్నా సకాలంలో రావడం లేదు. సిబ్బందిని బతిమిలాడి వైద్యం చేయించుకోవాల్సి వస్తున్నది.
– ఇస్లావత్ బాలు, సంపత్‌నగర్, రైతు, టేకులపల్లి మండలం
పాత భవనాల్లోనే నడిపిస్తున్నాం..
ఖరీదైన మందులు ఉండవు. ప్రభుత్వం ఇచ్చిన మందులు మాత్రమే ఉంటాయి. పెద్ద జబ్బులు తగ్గాలంటే బయట మందులు తీసుకోవాలి. సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. పాల్వంచ, భద్రాచలంలో ఏడీలు లేరు. పినపాక నియోజకవర్గంలో అంబులెన్స్ సిబ్బంది లీవ్‌లో ఉన్నారు. అందువల్ల వాహనం తిరగడం లేదు. పొదుగువాపు వస్తే మందులు వాడాలి. ఈ నెల 8 నుంచి 15 రోజులపాటు బొబ్బవ్యాధికి వ్యాక్సిన్ వేస్తాం.
– డాక్టర్ మామిళ్ల వెంకటేశ్వర్లు, జిల్లా పశువైద్యశాఖ అధికారి