రూ.30 కోట్లతో ‘నగర పాలిక’ నిర్మాణం
రఘునాథపాలెంలో రూ.2 కోట్లతో బృహత్ వనం..
ట్యాంక్‌బండ్‌పై రూ.8 కోట్లతో సస్పెన్షన్ బ్రిడ్జి..
ప్రత్యేక ఆకర్షణగా సిటీ లైబ్రరీ, నర్సరీలు, ప్రకృతి వనాలు
రేపు మంత్రులు కేటీఆర్, అజయ్‌కుమార్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
అడుగడుగునా అభివృద్ధి జాడ
గతంలో సమస్యలతో సతమతమైన ఖమ్మం నగరంలో నేడు ఎక్కడ చూసినా అభివృద్ధి జాడే కనిపిస్తున్నది. అద్దంలా మెరుస్తున్న రహదారులు, విద్యుత్ దీపాల కాంతులతో నగరం సరికొత్త శోభను సంతరించుకుంటున్నది. ఐటీ హబ్ యువతకు ఉపాధి వేదికగా మారగా.. నూతన మున్సిపాల్టీ భవనం ప్రగతికి చిహ్నంగా నిలుస్తున్నది. లకారం ట్యాంక్‌బండ్‌పై ఇటీవల నిర్మించిన తీగల వంతెన ధగ ధగ మెరుస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తున్నది. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తూ నగరానికి వన్నె తెస్తున్నారు. ఈ నెల 11న యువనేత, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఖమ్మం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నగరాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అత్యాధునిక వసతులతో నిర్మించిన మున్సిపల్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. పట్టణ ప్రగతిని పరిశీలించడంతోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
ఖమ్మం, జూన్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హైదరాబాద్ వంటి మహానగరాలకు దీటుగా ఖమ్మం నగరం దినదినాభివృద్ధి చెందుతున్నది. తన పరిధులను నానాటికీ విస్తరించుకుంటున్నది. అభివృద్ధికి కేరాఫ్‌గా నిలుస్తున్నది. ఇతర పట్టణాలు, నగరాలకూ ఆదర్శంగా నిలుస్తున్నది. ఎమ్మెల్యేగా, మంత్రిగా పువ్వాడ అజయ్‌కుమార్ నగరవాసుల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో ఖమ్మం నియోజకవర్గాన్ని రాష్ర్టానికే ఐకాన్‌గా తీర్చిదిద్దుతున్నారు. శనివారం ఖమ్మం నగరంలో రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రత్యేక కథనం.
నగరానికి ఆకర్షణగా ‘సిటీ లైబ్రరీ’
నిరుద్యోగ యువతీ యువకులకు వెన్నుదన్నుగా నిలిచి పోటీ పరీక్షలకు చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయాన్ని సిటీ సెంట్రల్ లైబ్రరీగా మారుస్తున్నది. సుమారు రూ.10 లక్షల నిధులు కేటాయించి ఆధునీకరణ పనులు చేపడుతున్నది. విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను సమకూర్చనున్నది. మంత్రులు కేటీఆర్, అజయ్ లైబ్రరీని ప్రారంభించనున్నారు.
పచ్చందాల బృహత్ వనం
రఘునాథపాలెం సమీపంలోని ఇల్లెందు ప్రధాన రహదారి పక్కన 14 ఎకరాల సువిశాల ప్రాంగణంలో రూ.2 కోట్ల నిధులతో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనం పచ్చందాలతో కళకళలాడుతున్నది. పాలకవర్గం వనం చుట్టూ పకడ్బందీగా ఫెన్సింగ్, వనం మధ్యలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసింది. వనం చుట్టూ విద్యుత్ దీపాలు అమర్చడంతో రాత్రిళ్లు కాంతులీనుతున్నది. ఆరు ఎకరాల్లో ట్యాంక్ బండ్, మిగిలిన ఎనిమిది ఎకరాల్లో ప్లాంటేషన్ కేటాయించారు. ప్రస్తుతం వనంలో 23వేల మొక్కలు పెరుగుతున్నాయి. వనంలో చిల్డ్రన్స్ పార్క్, ఓపెన్ జిమ్ సైతం అందుబాటులోకి వచ్చాయి. వనంలో ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటేన్ వనానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ఇప్పటికే వనానికి సందర్శకుల తాకిడి పెరిగింది. ఆ మార్గంలో వెళ్తున్న ప్రయాణికులు వనం వద్ద కాసేపు సేద తీరుతున్నారు. సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. ఈ వనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
ప్రారంభించనున్న అభివృద్ధి పనులు ఇవే..
నగరంలోని లకారం ట్యాంక్‌బండ్ వద్ద రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించిన సస్పెన్షన్ బ్రిడ్జి, టేకులపల్లిలో నిర్మితమైన 240 డబుల్ బెడ్రూం ఇండ్లు, ఎన్నెస్పీ క్యాంపు పరిధిలో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణం, టేకులపల్లిలో క్రీడా ప్రాంగణం, పట్టణ ప్రకృతి వనం, ధంసలాపురం వద్ద మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీ, నగరంలో రూ.30 కోట్లతో నిర్మించిన నగరపాలకసంస్థ కార్యాలయాన్ని మంత్రులు కేటీఆర్, అజయ్ ప్రారంభించనున్నారు. శ్రీనివాస్‌నగర్‌లో వ్యర్థ పదార్ధాల శుద్ధి కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
బహిరంగ సభకు ఏర్పాట్లు..
నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగ సభకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభను విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు జన సమీకరణపై దృష్టి సారించాయి. ఇప్పటికే నగర మేయర్ పునకొల్లు నీరజ, మంత్రి వ్యక్తిగత సహాయకుడు రవికిరణ్, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ పార్టీ అనుబంధ సంఘా నాయకులతో సమావేశమయ్యారు.
అభివృద్ధికి చిరునామా ఖమ్మం..
ఖమ్మం నగరాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలన్నదే ధ్యేయం.. నగరాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్, పురకపాలక మంత్రి కేటీఆర్ అందిస్తున్న సహాయ, సహకారాలు మరువలేనివి. మౌలిక వసతులు కల్పించి నగరవాసుల సమస్యలు పరిష్కరించిన ఘనత ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కింది. జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా. – మంత్రి పువ్వాడ అజయ్ కుమార్