సృష్టికి మూలం స్త్రీ. ఆమె శక్తియుక్తులు అపారం. ఆమె ఓ ప్రేరణ.. ఓ లాలన. ఆమె లేకుంటే ఈ సృష్టి లేదు. దానికి గమ్యం, గమనం లేదు. మనిషికి జీవం, జీవితమే లేదు. ఆమే లేకుంటే అంతా శూన్యం. అందుకే ఆమెకు శతకోటి వందనాలు. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చరిత్ర సృష్టిస్తున్నారు. అవకాశాలు రాకపోయినా, అవమానాలు ఎదురైనా.. ఎవరో వచ్చి సాయం చేస్తారని ఎదురుచూడడం లేదు. ఆకాశం, అవకాశాల్లో సగంగా అంటూ ముందంజలో దూసుకుపోతున్న స్త్రీమూర్తులెందరో. వంట గదికే ‘ఆమె’ను అంకితం చేద్దామని చూస్తే అంతరిక్షంలో దూసుకెళ్లింది. వాకిలి దాటొద్దని ఆంక్షలు పెడితే ఆవలి హద్దులు దాటి అవనిని జయించింది. అణచివేత నుంచి ఆత్మవిశ్వాసం వైపు పయనించింది. వంటింటి నుంచి విశ్వానికి ఎదిగింది. ఆమె ప్రస్థానం అంతా ఇంతా కాదు.. ఏ రంగమైనా నేనే మేటి అని నిరూపించిన తెగువ, తెలివి ఆమెది. నేడు ఆమె పండుగ. అదే.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
– ఖమ్మం కల్చరల్/ నమస్తే నెట్వర్క్, మార్చి 7
ఉమెన్స్ డే చరిత్ర..
ఆనాటి ఇంగ్లాండ్ పారిశ్రామిక విప్లవంలో మొదటిసారిగా ఆమె గళం విప్పింది. ఆనాడు మొదలైన మహోజ్వల విప్లవం విశ్వమంతా విస్తరించింది. పురుషుల కన్నా తక్కువ వేతనంతో పనిచేస్తున్న తమకు కూడా సరైన వేతనం ఇవ్వాలని నిరసన వ్యక్తం చేసింది. కట్టుబాట్లను తెంచుకొని ఉద్యమబాట పట్టింది. వేలాది వస్త్ర పరిశ్రమల కార్మికులు అమెరికా న్యూయార్క్‌లోని రడ్చర్స్వేర్ వద్ద 1908 మార్చి 8న పెద్దఎత్తున నిరసన చేపట్టారు. 8గంటల పని దినం, పురుషులతో సమాన వేతనం, సురక్షితమైన వాతావరణ పరిస్థితులు, లింగ , జాతి, ఆస్థి, అర్హతల బేధం లేకుండా ఓటుహక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా సారథ్యంలో కదం తొక్కిన ఆ నాటి ఉద్యమం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఉద్యమ ప్రాధాన్యంగా 1911లో డెన్మార్క్ కోపెన్‌హెగెన్‌లో జరిగిన రెండో అంతర్జాతీయ సోషలిస్ట్ మహిళల కాన్ఫరెన్స్‌లో మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించాలని తీర్మానించారు. నాటినుంచి అనేక దేశాలు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి.. మన దేశంలో మొదటిసారిగా 1943 మార్చి 8న ముంబైలో బొంబాయి సోవియట్ మిత్రమండలి మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది.
మహిళా శక్తి లేకపోతే సమాజంలో సరైన అభివృద్ధి ఉండదని గమనించిన సీఎం కేసీఆర్.. రాష్ట్ర పాలనా వ్యవస్థలో మహిళలకు పెద్దపీట వేశారు. ఆయన ప్రోత్సాహంలో నేడు తెలంగాణ పాలనా యంత్రాంగంలో అనేకమంది మహిళలు రాణిస్తున్నారు. అలా ముందుకెళ్లిన వారిలో ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి చెందిన వంకాయలపాటి మమత ఒకరు. ఇక్కడి నాగులవంచ గ్రామానికి చెందిన ఆమె.. టీజీవోస్ అధ్యక్షురాలిగా, జీహెచ్ఎంసీ స్పెషల్ గ్రేడ్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నాగులవంచలో పేద, మధ్య తరగతి కుటుంబానికి చెందిన వంకాయలపాటి వెంకటనర్సయ్య, విమలమ్మ దంపతులకు ఇద్దరు కుమారుల అనంతరం జన్మించారు మమత. ఆమె విద్యాభ్యాసంలో ఒకటి నుంచి ఏడు తరగతుల వరకు స్వగ్రామమైన నాగులవంచ ప్రభుత్వ పాఠశాలలోనే చదివింది. ఎనిమిది నుంచి పది తరగతుల వరకు జీహెచ్ఎస్ ఖమ్మంలో, ఇంటర్ జూనియర్ కళాశాల ప్రభుత్వ మహిళా కళాశాలలో, డిగ్రీ ఆంధ్ర మహిళా కళాశాల హైదరాబాద్‌లో, హిస్టరీ సబ్జెక్టుతో పీజీని ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో పూర్తి చేశారు. 1992 గ్రూప్ 2 సర్వీసెస్‌లో సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ అధికారిగా విధుల్లో చేరారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. అటు టీజీవోస్ నేతగా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి విశేష కృషి చేస్తున్నారు.
జిల్లా పీఠంపై మహిళామణులు
మగవాళ్లతో సమానంగా విధులు నిర్వహిస్తూ మగువలు తెగువ చూపిస్తున్నారు. కిందిస్థాయి ఉద్యోగి నుంచి జిల్లాస్థాయి అధికారిగా ఉంటూ తమదైన శైలిలో జిల్లా ప్రజలకు సేవలందిస్తూ ఉన్నతాధికారులు మన్ననలు పొందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పదివేల మంది సర్కారు ఉద్యోగులు ఉంటే వారిలో 5 వేలకు పైగా మహిళా ఉద్యోగులు ఉన్నారు. జడ్పీ సీఈవో, డీఎంహెచ్‌వో, ఇంటర్మీడియట్ అధికారి, జిల్లా సంక్షేమ అధికారి, ఉపాధికల్పనాధికారి, ఎస్సీ అభివృద్ధి అధికారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డు అధికారి, భద్రాచలం దేవస్థానం ఎండోమెంట్ అధికారి, గిరిజన సంక్షేమశాఖ డీడీ, వైద్యారోగ్యశాఖలో వైద్యులు, భద్రాచలం, కొత్తగూడెం ఆర్డీవోలు, ఏఎన్ఎం, ఆశ, అంగన్వాడీ, మెప్మా, అటవీశాఖ, పోలీస్‌శాఖ తదితర వివిధ రంగాల్లో ఎంతోమంది మహిళలు పనిచేస్తున్నారు.
అధ్యాపకురాలే కాదు.. సేవకురాలు కూడా..
అధ్యాపకురాలిగానే కాకుండా.. సమాజ సేవకురాలిగానూ రాణిస్తున్నారు కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంగ్లిష్ లెక్చరర్ దారా ప్రమీల. కళాశాలలో విద్యార్థులకు చదువు చెప్పడంతో ఆమె బాధ్యత ముగిసిందనుకోలేదు. విద్యార్థులను తన సబ్జెక్టులో మెరికల్లా తీర్చిదిద్దేందుకు వ్యక్తిగతంగా ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ డే నిర్వహించడం, ప్రాజెక్ట్ వర్క్స్ చేయించి బహుమతులు అందించడం వంటివి చేస్తున్నారు. ఓ ఎంబీబీఎస్ విద్యార్థినికి, మరో అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థికి, ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు. భద్రాద్రి జిల్లాలో గోదావరి వరదలు వచ్చినప్పుడు వరద ప్రాంతాల్లో పర్యటించి ఆహార పొట్లాలు, దుస్తులు అందించారు. ఇతర అధ్యాపకుల సహాయంతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. సత్తుపల్లి గ్రంథాలయానికి వందల సంఖ్యలో పుస్తకాలను వితరణ చేశారు. కరోనా సమయంలో పనులకు వెళ్లలేని పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు.
పేద విద్యార్థులకు చేయూతనందిస్తూ..
తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ సంస్థ డైరెక్టర్‌గా 13 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న జీ.శ్రీలత.. తమ వద్ద శిక్షణ పొందే ఎందరో పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు. ఎస్ఐ, కానిస్టేబుల్ శిక్షణ తీసుకునే విద్యార్థులకు మ్యాట్లు, రన్నింగ్ బూట్లు సహా ఇంకా అనేక వస్తువులు అందించారు. మరెన్నో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఏటా పదిమంది పేద విద్యార్థుల ఫీజులు చెల్లించడంతోపాటు వారికి పుస్తకాలూ అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నగరంలోని అనాథాశ్రమాలకు తన శక్తి మేరకు ఆర్థిక సాయ అందిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆరు సార్లు ఉత్తమ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు.
నేటి ‘నెలనెలా వెన్నెల’.. మహిళల ప్రత్యేకం..
ఖమ్మం కల్చరల్, మార్చి 7: మహిళా దినోత్సవం సందర్భంగా ‘అమరజీవి అన్నాబత్తుల రవీంద్రనాథ్ కళా సాంస్కృతిక సంస్థ (ఆర్క్స్)’, ‘నెలనెలా వెన్నెల’ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు డాక్టర్ నాగబత్తిని రవి, జగన్మోహన్రావు, ఏఎస్ కుమార్ తెలిపారు. ఉత్సవ వివరాలను మంగళవారం వారు ఖమ్మంలో వెల్లడించారు. ఈ నెల 8న ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఉత్సవాలకు కలెక్టర్ వీపీ గౌతమ్, సినీ నటి శంకరాభరణం రాజ్యలక్ష్మి, ఇతర జిల్లా అధికారులు హాజరవుతారని తెలిపారు. ఖమ్మం కళా పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేల్పుల విజేత, ప్రజా నాట్య మండలి అధ్యక్ష కార్యదర్శులు నామా లక్ష్మీనారాయణ, వేముల సదానందం పాల్గొన్నారు.
మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తేనే దేశాభివృద్ధి
మహిళలు అన్నిరంగాల్లో రాణించినప్పుడే దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. సింగరేణి మహిళా డిగ్రీ కాలేజీలో 31 సంవత్సరాలుగా పీడీగా విధులు నిర్వహిస్తున్నాను. ఆమె ఎనిమిది సార్లు వరల్డ్ చాంపియన్‌షిప్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్నాను. కెనడా, ఆస్ట్రేలియా, డెన్మార్క్, టర్కీ, దుబాయ్, యూరప్‌లో జరిగిన పోటీలకు హాజరయ్యారు. 15సార్లు నేషనల్ స్థాయిలో పాల్గొని విజయం సాధించారు. 11సార్లు మహిళా కళాశాల తరపున కాకతీయ యూనివర్సిటీ క్రీడల్లో పార్టిసిపేట్ చేయించి విద్యార్థులు ఓవరాల్ చాంపియన్ సాధించేలా కృషిచేశారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని వందమందికి పైగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కూడా సాధించారు. నా భర్త సుధాకర్‌రెడ్డితోపాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే నేను ఈ విజయాలు సాధించగలిగాను.
– డాక్టర్ సావిత్రి, సింగరేణి మహిళా కళాశాల పీడీ
పరుగుల రాణి సుష్మ..
సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయంలో జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్న సుష్మ పరుగుపందెంలో విశేష ప్రతిభ చూపుతున్నారు. 2019లో ఉద్యోగ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 2020లో కోలిండియా స్థాయి పోటీల్లో 100, 200 మీటర్ల విభాగాలు, రిలే పరుగులో విజేతగా నిలిచారు. అదే టోర్నీలో లాంగ్‌జంప్‌లో వెండి పతకం దక్కింది. 2020 కంపెనీ స్థాయి క్రీడా పోటీల్లో 100, 200 మీటర్లు, లాంగ్‌జంప్, రిలే పరుగులో విజేతగా నిలిచి స్వర్ణాలు సొంతం చేసుకున్నది. కోలిండియా పోటీల్లో 100 మీటర్లు, 4X100 రిలే, లాంగ్‌జంప్‌లో బంగారు పతకాలు దక్కించుకున్నారు.
ఉద్యోగ కల్పనలో ‘విజేత’
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధి కల్పనశాఖలో జిల్లా అధికారిగా పనిచేస్తున్న వేల్పుల విజేత ఉద్యోగ కల్పనలో ‘విజేత’గా నిలిచారు. వృత్తి ధర్మంతోపాటు సామాజిక సేవలో రాణిస్తున్నారు. కొవిడ్ సమయంలో సుమారు 3వేల మందికి కిట్లను అందించారు. నిరుపేదల విద్యార్థులకు బాసటగా నిలిచారు. ఇప్పటివరకు 22 వేల మందికి ఉద్యోగాలు ఇప్పించారు. తాను పుట్టి పెరిగిన సొంత ఊరి రుణం తీర్చుకోవాలని ఎవరు నిరక్షరాస్యులుగా ఉండకూడదని ఉద్దేశంతో తన పుట్టిన ఊరు ఖంబంపాడులో పాఠశాలను నిర్మించారు. కల్లూరుకు చెందిన కనపర్తి కృష్ణవేణికి ప్రతి ఏటా ఎంబీబీఎస్ కోర్సుకు కావాల్సిన ఫీజు కట్టి తన ఉదార స్వభావాన్ని చాటారు. తన వృత్తితోపాటు ప్రవృత్తికి సామాజిక సేవలు చేస్తున్న విజేత పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటివరకు 60 నుంచి 70 వరకు జాబ్‌మేళాలు నిర్వహించారు.
కోలిండియాలో రాణిస్తున్నా..
సింగరేణి సంస్థ ప్రోత్సాహం వల్లనే గత రెండు సంవత్సరాలుగా సంస్థ ఆధ్వర్యంలో కోలిండియా స్థాయిలో రాణిస్తున్నాను. 2019 ఆగస్టు నెలలో సింగరేణిలో కారుణ్య నియామకాల్లో భాగంగా జనరల్ మజ్దూర్‌గా విధుల్లో చేరాను. 2020, 2022లో కోలిండియా స్థాయిలో షార్ట్‌పుట్, డిస్కస్‌త్రోలో ప్రథమస్థానంలో గెలుపొందాను. 4×100 రిలేలో బంగారు పతకం సాధించా. చిన్నప్పటి నుంచి క్రీడల్లో ఆసక్తి ఉంది. పాఠశాల, కళాశాలలో రాష్ట్రస్థాయిలో రాణించి జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్నాను. సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో చదివే సమయంలో ఆలిండియా యూనివర్సిటీ క్రీడల్లో కూడా పాల్గొన్నాను. సింగరేణిలో ఉద్యోగం వచ్చిన తరువాత సింగరేణి ప్రోత్సాహంతో 2020, 2022లో కోలిండియా స్థాయిలో చాంపియన్‌గా నిలబడ్డాను.
– కడలి మాన్విత, సింగరేణి ప్రధాన ఆస్పత్రి జనరల్ మజ్దూర్
మహిళలు అధైర్యపడొద్దు..
విధుల్లో ఎన్ని అవాంతరాలు ఎదురైనా అధైర్యపడకుండా మహిళలు ముందుకుసాగాలి. సింగరేణిలో ఏప్రిల్ 2, 1990లో వెల్ఫేర్ ఆఫీసర్‌గా విధుల్లో చేరాను. బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రిలో, తరువాత కొత్తగూడెం కార్పొరేట్ ఎడ్యుకేషన్ సొసైటీలో, అనంతరం వెల్ఫేర్ సీనియర్ పీవో, డీవైపీఎంగా విధులు నిర్వహించాను. 2006 నుంచి 2010 వరకు డీవైపీఎంగా చేశాను. మెయిన్ ఆస్పత్రిలో ఆరు నెలలు పనిచేసి ఆ తరువాత కార్పోరేట్ పర్సనల్ ఐఆర్ విభాగంలో 2010 నుంచి ఇప్పటివరకు పనిచేస్తూ ప్రస్తుతం ఏజీఎం స్థాయిలో ఉన్నాను. సింగరేణి సంస్థలో పురుషులు అత్యధికంగా ఉండే పర్సనల్ విభాగంలో మహిళగా రాణిస్తూ ఏజీఎం స్థాయికి ఎదిగాను.
– ఏజీఎం పర్సనల్(ఐఆర్) కవితా నాయుడు, సింగరేణి హెడ్డాఫీస్
మా ఇంట్లో అందరం ఉద్యోగులమే
మా అమ్మనాన్న ఆడమగా తేడా లేకుండా మమ్మల్ని చదివించారు. అక్క ఖమ్మం డీఆర్డీవో, అన్నయ్య ఆర్అండ్బీ ఈఈ, అరమెరికలు లేని కుటుంబంగా పెరిగాము. మా వారు టీచర్, నాన్న టీచర్ విద్య గురించి తెలుసు.. అందుకే పై చదువులు చదివించారు. ఎంఏ ఎంఫిల్ చేశాను. పాల్వంచ ఎంపీడీఓగా మొదటి పోస్టింగ్. అడిషనల్ పీడీ తర్వాత జిల్లా సీఈవోగా చేస్తున్నాను. మా కుటుంబం చాలా అనందంగా ఉంది.
– ఎం.విద్యాలత, జడ్పీ సీఈవో
ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగం వచ్చింది
నోటిఫికేషన్ ద్వారా జాబ్‌లో చేరాను. గ్రేడ్-1 సూపర్వైజర్గా ఐసీడీఎస్‌లో చేరాను. ఇప్పుడు ప్రాజెక్టు అధికారిగా చేస్తున్నాను. మా పిల్లలను కూడా చదివించాను. దళిత కుటుంబంలో పుట్టాను. నాన్న అమ్మ స్ఫూర్తితో చదువుకున్నాను. అమ్మ టైలరింగ్ చేసినా చదువుకోవాలని చెప్పడంతో నేను ఇంతవరకు రాగలిగాను. మా పాపలను కూడా చదివించాను. భర్త సింగరేణిలో టీచర్‌గా చేస్తున్నారు. ఆడవాళ్లకు ఇంటి పనులు చేయాలి.. ఉద్యోగంలో విధులు నిర్వహించాలి కష్టం అయినా తప్పదు.
– స్వర్ణలత లెనీనా, డీడబ్ల్యూవో
నలుగురికి ఉత్తమ అవార్డులు
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 7 (నమస్తేతెలంగాణ) : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భద్రాద్రి జిల్లాలో ముగ్గురు, ఖమ్మం జిల్లాలో ఒకరికి ఉత్తమ పురస్కారాలు దక్కాయి. వీరు వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ప్రాంగణంలో బుధవారం అవార్డు, ప్రశాంసాప్రతంతోపాటు రూ.లక్ష నగదు తీసుకోనున్నారు.
ఉత్తమ అంగన్వాడీ టీచర్‌గా జ్యోతి
లక్ష్మీదేవిపల్లి మండలం గట్టమళ్ల వలస గొత్తికోయల గ్రామంలో పనిచేస్తున్న బానోత్ జ్యోతి ఉత్తమ అంగన్వాడీ టీచర్‌గా ఎంపికైంది. అక్కడ నివసించే వలస గిరిజన కుటుంబాల పిల్లలకు అందిస్తున్న సేవలతోపాటు దాతల సహకారంతో కొత్త అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించింది. గతంలో కూడా రెండుసార్లు ఉత్తమ టీచర్ అవార్డును అందుకున్నారు. పిల్లలకు ఉదయం ఆటపాటలు నేర్పి మధ్యాహ్నం సెంటర్లోనే నిద్రపుచ్చుతానని పేర్కొంటున్నారు జ్యోతి. అంతేకాదు పక్కనే ఉన్న మరో ఊరికి కూడా వెళ్లి పిల్లలకు భోజనం పెట్టి స్కూల్ చెప్తానని తెలిపారు.
క్రికెట్లో సత్తా చాటిన త్రిష
భద్రాచలం పట్టణానికి చెందిన గొంగడి త్రిష క్రికెట్లో సత్తా చాటింది. జనవరి 14 నుంచి 29 వరకు జరిగిన వరల్డ్‌కప్ పోటీలో జట్టు విజయానికి కారణమైన త్రిష బెస్ట్ క్రికెటర్‌గా ఎంపికైంది. ఇండియా తరఫున ఆడిన త్రిష ఇంగ్లండ్ జట్టు ఓటమిలో కీలక భూమిక పోషించారు. ఇండియా తరఫున గోల్డ్‌మెడల్‌ను అందుకున్నారు. భద్రాచలంలో పుట్టిన త్రిష ప్రస్తుతం హైదరాబాద్ సైనిక్‌పురిలో ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నది. ఈమె ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం ఉత్తమ క్రికెటర్‌గా ఎంపిక చేసింది.
ఉత్తమ ఆశ కార్యకర్తగా కృష్ణవేణి
అశ్వాపురం మండలం మొండిగ్రామంలో పని చేస్తున్న ఆశ కార్యకర్త మండలి కృష్ణవేణి ఉత్తమ అవార్డుకు ఎంపికైంది. 2059 జనాభా ఉన్న గ్రామంలో వైద్యసేవలు అందిస్తూ మంచిపేరు తెచ్చుకున్నది. కరోనా కష్టకాలంలోనూ ఇంటింటికీ తిరిగి మందులు పంపిణీ చేసింది. ఏడాదిలో 28మంది ప్రసవాల్లో 19 సర్కారు ఆసుపత్రిలో జరిగేలా చర్యలు తీసుకున్నది. ఎవరికి జ్వరం వచ్చినా రక్త పూతలు తీసి మందులు ఇస్తూ మంచిపేరు తెచ్చుకున్నారు. 1999 నుంచి పనిచేసిన ఆమెకు గత ఏడాది ఆశ సమ్మేళనంలో బెస్ట్ కార్యకర్తగా అవార్డు అందుకున్నారు. ఇప్పుడు ఆమె సేవలను గుర్తించి ఉత్తమ అవార్డుకు ఎంపిక చేశారు.
మదర్‌థెరిసా స్ఫూర్తితో..
మదర్‌థెరిసా స్ఫూర్తితో సమాజ సేవకురాలిగా మారారు ఖమ్మం జిల్లా బోనకల్లు శాంతినిలయం నిర్వాహకురాలు సిస్టర్ ఆల్పీ. థెరిసాను ఆదర్శంగా తీసుకున్న ఆమె. 1988లో సమాజ సేవకు అంకితమయ్యారు. ఖమ్మం బిషప్ మైపన్పాల్ సహకారంతో బోనకల్లు మండలం చిరునోముల గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాల్లోకి వెళ్లినప్పుడు ఆమెకు మానసిక దివ్యాంగ పిల్లలు కనిపించడంతో వీరికి సేవ చేయాలనే ఆలోచన కలిగింది. 2004లో అప్పటి కలెక్టర్ అరవింద్‌కుమార్ శాంతినిలయం ఏర్పాటుకు భూమిని కేటాయించారు. భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ శాంతి నిలయంలో కేవలం మానసిక వికలాంగులైన ఆడపిల్లలను మాత్రమే చేరదీసి ఆదరిస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 85మంది పిల్లలకు సేవలు అందిస్తూ వారిని కంటికిరెప్పలా కాపాడుతున్నారు. బోనకల్లులోనే కాకుండా అశ్వాపురంలో ఆమె సహచరురాలు సిస్టర్ బిజిలీతో మరో నిలయాన్ని ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు ఆల్పీ. ఆమె సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2015లో ఉత్తమ సేవకురాలు అవార్డును ప్రదానం చేసింది.
అమ్మనాన్న ఇద్దరూ టీచర్లే
చదువుకున్న కుటుంబంలో పుట్టడం నా అదృష్టం. అందుకే డాక్టర్నయ్యాను. మొదటి పోస్టింగ్ తిరువూరు సీహెచ్‌సీలో చేరాను. ఇప్పుడు జిల్లా పోస్టు చేస్తున్నాను. మహిళలు అన్నిరంగాల్లో ముందుంటున్నారు. ఆడమగా తేడా ఉండకూడదు. ఇద్దరిని సమానంగా చదివిస్తే ఆడవాళ్లు కూడా జాబ్ చేసే అవకాశాలు ఉంటాయి.
– జేవీఎల్ శిరీష, డీఎంహెచ్‌వో
అన్నిరంగాల్లో ముందుండాలి
అందరూ అన్నిరంగాల్లో ముందుండాలి. అప్పుడే సమానత్వం ఉంటుంది. కెమిస్ట్రి లెక్చరర్‌గా చేరాను. ఇప్పుడు జిల్లా అధికారిగా చేస్తున్నాను. జిల్లా పోస్టు చేయడం కష్టమైనా ఇష్టంగా చేస్తున్నాను. నాన్న సింగరేణిలో జాబ్ చేశారు. అమ్మనాన్నల స్ఫూర్తితో ప్రభుత్వ ఉద్యోగం సాధించాను. భయపడుతూ బతకకూడదు. భయపెట్టేలా బతకాలి. దటీజ్ ఉమెన్.
– సులోచనారాణి, ఇంటర్మీడియట్ అధికారి