ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురిసిన భీకర వర్షం జలప్రళయాన్ని తలపించింది. అల్పపీడనం వాయుగుండంగా మారి.. కుంభవృష్టిని కురిపించింది. దీంతో ఉమ్మడి జిల్లా అతలాకుతలమైంది. అత్యంత భారీ వర్షాల వల్ల శనివారం అర్ధరాత్రి నుంచి మొదలైన వరద.. రాత్రికి రాత్రే ఊళ్లను, కాలనీలను ముంచెత్తింది. వేకువజామునే వచ్చిన ఈ ఊహించని ప్రమాదంతో దిగ్భ్రాంతికి గురైన బాధిత ప్రజలు.. డాబాలు, ఎత్తయిన ప్రదేశాలు ఎక్కారు. కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. వాగులు, వంకలు, ఏర్లు, ప్రాజెక్టులు, నదులు ఉప్పొంగాయి. ఖమ్మంలో మున్నేరు మహోగ్రాన్ని మరిపించింది.
పరీవాహక ప్రాంతాలన్నీ చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఆయా ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించింది. రహదారుల మీద ప్రమాదకర స్థాయిలో వరద ప్రవహించిన కారణంగా ఆయా మార్గాల్లో వాహనాల రాకపోకలను అధికారులు నిలుపుదల చేశారు. పాలేరు పొంగి ప్రధాన రహదారిపై ప్రవహించడంతో జిల్లా నుంచి సూర్యాపేట మీదుగా రాష్ట్ర రాజధానికి వెళ్లే వాహనాలన్నింటినీ నిలుపుదల చేశారు. కొన్నింటిని దారి మళ్లించారు. జిల్లా నుంచి హైదరాబాద్ మధ్య, ఖమ్మంమధిర మధ్య ఆర్టీసీ సర్వీసులను అధికారులు రద్దు చేశారు. మిగిలిన రూట్లలో కూడా బస్సుల సంఖ్యను తగ్గించారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు బస్టాండ్లలో పడిగాపులు కాశారు.
-ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ఖమ్మం/తిరుమలాయపాలెం/ కూసుమంచి, సెప్టెంబర్ 1
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా వరద సహాయక చర్యలు శూన్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఖమ్మం వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. వర్షం కారణంగా మున్నేరు లోతట్టు ప్రాంత ప్రజలు అనేకమంది నిరాశ్రయులయ్యారని, అనేకమంది వరదలోనే చిక్కుకున్నారని, పలువురు వరదలోనే ఉండి ఇళ్లపైకి బిక్కుబిక్కుమంటూ భయంతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా మంత్రుల్లో చలనం లేదని కేటీఆర్ విమర్శించారు.