ఖమ్మం వ్యవసాయం, జూన్ 13 : జిల్లాలోని పలు మండలాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో గురువారం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండతోపాటు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు సాయంత్రం కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే దుక్కులు దున్నుకొని విత్తనాలు నాటడానికి సిద్ధంగా ఉన్న రైతులకు వర్షం ఊరటనిచ్చింది. ఖమ్మం నగరానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు వర్షంతో ఇబ్బందిపడ్డారు. జిల్లాలోని కొణిజర్ల మండలంలో రికార్డు స్థాయిలో 68.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
బోనకల్ 53.3 మి.మీ, మధిర 52.8 మి.మీ, ఖమ్మం అర్బన్ 51.5 మి.మీ, చింతకాని 50 మి.మీ, రఘునాథపాలెం 46.8 మి.మీ, ఖమ్మం రూరల్ మండలంలో 26 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు అడపా దడపా కురిసిన వర్షాలతో జిల్లావ్యాప్తంగా 39,707 ఎకరాల్లో రైతులు విత్తనాలు నాటారు. వానకాలం సాగు లక్ష్యం 5.96 లక్షల ఎకరాలు కాగా.. ఇందులో ఇప్పటికే 788 ఎకరాల్లో రైతులు వరి నార్లు పోసుకున్నారు. రికార్డు స్థాయిలో ఇప్పటివరకు పత్తి సాగు 30,825 ఎకరాలకు చేరిందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. పెసర సాగు 728 ఎకరాలు కాగా.. పచ్చిరొట్టను మరో 8 వేల ఎకరాల్లో సాగు చేశారు.