కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 16: అమరుల త్యాగాల గడ్డ తెలంగాణ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇలాంటి గడ్డపై మతతత్వ బీజేపీకి స్థానం లేదని స్పష్టం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యాక తొలిసారి భద్రాద్రి జిల్లాకు వచ్చిన సందర్భంగా సీపీఐ శ్రేణులు శుక్రవారం ఆయన ఘనస్వాగతం పలికాయి.
కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేశారు. అనంతరం కొత్తగూడెం క్లబ్లో జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్తా పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడేందుకు రాజీలేని ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా సమాజాన్ని ఏకం చేస్తామని, బీజేపీని తరిమికొడతామని అన్నారు.