చిన్నకోడూరు, జూన్ 15: కృతజ్ఞతకు, ఆశకు మధ్య జరిగిన పోటీలో ఆశ గెలిచిందని.. నాడు కాంగ్రెస్ ప్రజలకు ఆశ చూపి నేడు మోసం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం శంకరాయకుంటలో బాలవికాస వాటర్ ప్లాంట్, సీసీ రోడ్డు పనులకు సోమవారం ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. శంకరాయకుంట గ్రామం అంటే కేసీఆర్‌కు ఎంతో ప్రేమ అని గుర్తుచేశారు. శంకరాయకుంట గ్రామం చిన్నదైనా, మనసు మాత్రం పెద్దది అన్నారు.
గతంలో ఓబుళాపూర్‌లో ఉండే ఈ గ్రామాన్ని గ్రామపంచాయతీ చేయాలని కోరగానే, కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నూతన గ్రామ పంచాయతీగా చేశామన్నారు. నేడు వాటర్ ప్లాంట్ ను ప్రారంభించుకున్నామని, వంద క్యాన్లు పంపించినట్లు హరీశ్‌రావు తెలపారు. బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకున్నామని, ఈ గ్రామం నుంచే రింగ్ రోడ్డు పోయేలా కృషి చేశామన్నారు. గ్రామంలోని నాగిరెడ్డి చెరువుకు కాళేశ్వరం నీళ్లు తెచ్చినట్లు తెలిపారు.
గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని, ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయని, భవిష్యత్‌లో అన్ని పూర్తి చేసుకుందామని భరోసా ఇచ్చారు. అనేక హామీలిచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత ప్రజలను మోసం చేసిందని హరీశ్‌రావు విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మాజీ ఎంపీపీ మాణిక్య రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పాపయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, సొసైటీ మాజీ చైర్మన్ కనకరాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొండం రవీందర్‌రెడ్డి, మోసర్ల మధుసూదన్ రెడ్డి, సర్పంచ్ మాకు మహేశ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.