బోనస్ పేరిట పెట్టిన ఒట్టు.. ఒట్టి బోగస్సేనని నిగ్గుతేలింది. కర్షకులందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ధాన్యం విక్రయించి 50 రోజులు దాటినా వారికి ఇంకా బోనస్ నగదును జమ చేయకపోవడమే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా వంటి పథకాలను ఇప్పటికీ పూర్తిస్థాయిలో అర్హులకు అందించని ప్రభుత్వం.. తాజాగా బోనస్ విషయంలోనూ అన్నదాతలను మోసం చేస్తోంది. తాము గెలిస్తే క్వింటా వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్.. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని తీసి పక్కన పెట్టింది. పైగా సవాలక్ష షరతులు పెట్టింది.
కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటూ మెలికలు పెట్టింది. దీంతో చేసేదేమీ లేక రైతులందరూ అష్టకష్టాలూ పడి సన్నాలు పండించారు. భారమైనప్పటికీ తీసుకెళ్లి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ వస్తే.. తమ రెక్కల కష్టం పోయినా.. కనీసం పెట్టుబడి అయినా మిగులుతుందని ఎంతో ఆశపడ్డారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వారి ఆశలపై ఎప్పటికప్పుడు నీళ్లు చల్లుతూ వస్తోంది. కేవలం ప్రభుత్వం ఇచ్చిన మాటను విశ్వసించిన కర్షకులు.. అధిక విస్తీర్ణంలో సన్నాలను పండించి సర్కారుకు విక్రయించారు.
కానీ కర్షకులపై విశ్వాసాన్ని చూపని కాంగ్రెస్ సర్కారు మాత్రం.. బోనస్ నగదు చెల్లింపుల్లో కాలయాపన చేస్తోంది. రోజులకు రోజులు ఆలస్యం చేస్తుండడంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. అయితే, ధాన్యం విక్రయించిన రైతుల్లో కొందరికి వడ్ల నగదును మాత్రమే జమ చేసిన ప్రభుత్వం.. మరికొందరికి దానిని కూడా అందించలేదు. చివరికి బోనస్ జమ విషయంలోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తోంది. తక్కువ మొత్తంలో చెల్లించాల్సిన రైతులకు మాత్రమే బోనస్ జమ చేసి.. ఎక్కువ మొత్తంలో జమ చేయాల్సిన రైతులకు మాత్రం ఎగనామం పెడుతున్నట్లుగా కన్పిస్తోంది. దీంతో బోనస్ విషయంలో ఈ ప్రభుత్వం తమను దగా చేస్తోందంటూ అన్నదాతలు భగ్గున మండిపడుతున్నారు.
-ఖమ్మం, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
రైతులకు బోనస్ డబ్బులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పి రెండు నెలలైనా ఇంతవరకు నాకు బోనస్ డబ్బులు పడలేదు. నేను పండించిన 63 క్వింటాళ్ల 20 కిలోల వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. వడ్లను విక్రయించి రెండు నెలలైనా ఇంతవరకు నా ఖాతాలో డబ్బులు జమ చేయలేదు. ఇలా నాతోపాటు చాలా మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడలేదు. దీంతో కార్యాలయాల చుట్టూ తిరగడమే పని పెట్టుకుంటున్నారు.
-పందేటి వెంకయ్య, రైతు, దమ్మపేట
నా భార్య గంగమ్మ పేరు మీద 50 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించాం. వడ్ల డబ్బులు నా భార్య ఖాతాలో జమ అయ్యాయి. కానీ ప్రభుత్వం ఇస్తానన్న బోనస్ పడలేదు. క్వింటాకు రూ.500 చొప్పున 50 క్వాంటాళ్ల ధాన్యానికి బోనస్ రావాల్సి ఉంది. ప్రభుత్వం కొందరు రైతులకు బోనస్ వేస్తే.. మరికొందరు రైతులకు వేయడం లేదు. హామీ మేరకు బోనస్ ఇవ్వడం లేదు.
– బానోత్ రమేశ్, రైతు, సుద్దవాగుతండా, తిరుమలాయపాలెం
మేం స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ధాన్యం విక్రయించాం. క్వింటాకు రూ.500 చొప్పున ప్రభుత్వం నుంచి బోనస్ నగదు మా బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని అధికారులు చెప్పారు. కానీ ఇంకా బోనస్ డబ్బులు పడలేదు. ఎప్పుడు పడతాయని అధికారులను అడిగితే.. ఆన్లైన్ చేశామని సమాధానం చెబుతున్నారు. అందరికీ బోనస్ డబ్బులు వస్తాయని చెప్పారు. కానీ ఎప్పుడొస్తాయో చెప్పడం లేదు.
-తెల్లం నాగమ్మ, మహిళా రైతు, చిన్నరాయిగూడెం, మణుగూరు
37 క్వింటాళ ధాన్యం దిగుబడి రావడంతో కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తుందని చెప్పడంతో ఎంతో ఆశపడ్డా. ధాన్యం అమ్మి నెలలు గడుస్తున్నా ఇంతవరకు నా ఖాతాలో బోనస్ డబ్బులు జమ కాలేదు. ప్రభుత్వం మాయమాటలు చెప్పి రైతులను అనేక రకాలుగా మోసం చేస్తుంది. రైతులు ఈ ప్రభుత్వంపై నమ్మకాన్ని కోల్పోయారు. ఎవరి మాటలు నమ్మాలో అర్థం కావడం లేదు.
-మోటపోతుల వేణు, రైతు, వేంసూరు
కాంగ్రెస్ ప్రభుత్వంలో మాటలు తప్ప చేతలు లేవు. రైతులకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామనే మాట కూడా అలాగే ఉంది. మొదట్లో ఇచ్చామని గొప్పలు చెప్పి పండుగలు చేశారు. కానీ ఇవ్వలేదు. 210 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలించాను. బోనస్‌కు సంబంధించిన ఒక్క రూపాయి కూడా పడలేదు. ఎవరిని అడగాలో అర్థం కావడం లేదు. ఈ ప్రభుత్వం రైతులను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నట్లుంది.
-వెలివెల కృష్ణయ్య, రైతు, పెనుబల్లి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పినట్లుగా బోనస్ వస్తుందనే ఆశతోనే వానకాలంలో సీజన్లో సన్నధాన్యం పండించాం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ సన్న వడ్లు వేసేందుకే మొగ్గు చూపాం. క్వింటాకు రూ.500 బోనస్ వస్తుందని ఎంతో ఆశించాం. ఆ బోనస్ నగదు వస్తే పెట్టుబడి తీరుతుందని అనుకున్నాం. కానీ సీఎం రేవంత్‌రెడ్డి మాట ఇచ్చినట్లుగా ఇప్పటి వరకు మా ఖాతాల్లో బోనస్ నగదు జమ కాలేదు.
-బట్ట నరసింహారావు, రైతు, కమలాపురం, మణుగూరు
మూడెకరాల్లో వరి పంట సాగు చేశాను. 67 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. సన్నాలకు బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించాను. వారం రోజుల్లో బోనస్ వస్తుందని చెప్పినా ఇప్పటివరకు బోనస్ పడలేదు. 45 రోజుల పైబడి ఎదురు చూస్తున్నా. అసలు బోనస్ డబ్బులు వస్తాయో… రావో అర్థం కావడం లేదు. అధికారులను అడిగితే వస్తాయిలే అని చెబుతున్నారు. వెంటనే బోనస్ డబ్బులు వచ్చేలా చూడాలి.
-మిరియాల కోటేశ్వరరావు, రైతు, అన్నపురెడ్డిపల్లి
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వడ్లు తరలించి నెలలు దాటినప్పటికీ ఇంతవరకు బోనస్ డబ్బులు పడలేదు. మాకు డబ్బులు పడ్డాయి అని చెప్పే రైతులే లేరు. అదిగో ఇదిగో అని మాటలు చెప్పడమే తప్ప ఇంతవరకు డబ్బులు పడిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులకు ఏమాత్రం నమ్మకం లేదు. రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదు.
-కాకా ప్రసాద్, రైతు, తాళ్లపెంట