భద్రాచలం, మే 21 : నిరుద్యోగుల గొంతుక ఏనుగుల రాకేశ్‌రెడ్డిని శాసన మండలికి పంపేందుకు పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బిట్స్ పిలానీలో ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తి ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారని, ఆయనకు కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించారన్నారు. రాకేశ్‌రెడ్డిని గెలిపించుకుంటే నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తారన్నారు. అదే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఓటేస్తే ప్రశ్నించడం పక్కనపెట్టి.. ప్రభుత్వాన్ని ప్రశంసించడమే పనిగా పెట్టుకుంటాడన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చిన గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని, రైతు రుణమాఫీ ఏమైందో ఇంకా తెలియడం లేదన్నారు. ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకు, అధికారం దక్కించుకునేందుకు మాత్రమే హామీలను కుమ్మరించారన్నారు. ఈ నెల 27న జరిగే నల్లగొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానె రామకృష్ణ, మణుగూరు జడ్పీటీసీ పోశం నరసింహారావు, బీఆర్ఎస్ నాయకులు గోపిరెడ్డి వెంకటరమణారెడ్డి, మండల నాయకులు ఆకోజు సునీల్, దానియేలు ప్రదీప్, అయినాల రామకృష్ణ, ప్రభుకుమార్ తదితరులు పాల్గొన్నారు.