మణుగూరు టౌన్, డిసెంబర్ 21: మాతాశిశువుల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. ముఖ్యంగా గర్భిణుల్లో రక్తహీనత నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అన్నారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని మణుగూరులోని వంద బెడ్ల ఆసుపత్రిలో బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గర్భం దాల్చిన మహిళ పౌష్టికాహారం తీసుకుంటేనే కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని అన్నారు. అప్పుడే ఆమె ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తుందని అన్నారు. రక్తహీనత వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గర్భిణులు ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వలేరని అన్నారు.
ఈ కారణం వల్లనే అనేక శిశుమరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. అందుకని మాతాశిశు మరణాలపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పథకానికి శ్రీకారం చుట్టిందని వివరించారు. రక్తహీనత కలిగిన గర్భిణులున్న జిల్లాల్లో భద్రాద్రి కూడా ఉన్నందున ప్రభుత్వం ఈ జిల్లాలోని గర్భిణుల ఆరోగ్యం కోసం ఈ కిట్లను పంపిందని అన్నారు. గర్భిణులందరూ ఈ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనివ్వాలని సూచించారు. జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎంపీపీ కారం విజయకుమారి, బీఆర్ఎస్ నాయకులు ముత్యం బాబు, అడపా అప్పారావు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.