ఖమ్మం : పారిశుద్ధ్య నిర్వహణలో కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( Puvvada Ajaykumar ) ఆరోపించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణమే సమగ్ర ప్రణాళిక రూపొందించి పారిశుద్ధ్య సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
వర్షాకాలం దృష్ట్యా ఖమ్మం జిల్లాను పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. పారిశుద్ధ్యం లోపించడం అపరిశుభ్రత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రతిచోటా చెత్త పేరుకుపోవడం, మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడంతో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.