ఖమ్మం/ పాల్వంచ, సెప్టెంబర్ 1: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ జేఏసీ) ఆధ్వర్యంలో ఉద్యోగులు, పెన్షనర్లు నల్లబ్యాడ్జీలు ధరించి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ల ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఖమ్మం కలెక్టరేట్ వద్ద జరిగిన కార్యకమంలో టీజీఈ జేఏసీ చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తమ న్యాయమైన పెన్షన్ హకుల కోసం కొనసాగుతున్న ఉద్యమానికి ప్రతీ ఒక్కరూ మద్దతు పలకాలని కోరారు. పాల్వంచలో బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ అమరనేని రామారావు, కార్యదర్శి జనరల్ సంగం వెంకటపుల్లయ్యలు మాట్లాడుతూ ఉద్యోగులకు నష్టం కలిగించే విధంగా ఉన్న సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఖమ్మంలో టీజీవో సెక్రటరీ మోదుగు వేలాద్రి, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తుంబూరు సునీల్‌రెడ్డి, పీఆర్ ఉద్యోగుల సంఘం నాయకుడు మల్లెల రవీంద్ర ప్రసాద్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, అధ్యక్షుడు ఎస్కే రంజాన్, తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కల్యాణం కృష్ణయ్య, కార్యదర్శి సుబ్బయ్య, పీఆర్, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పరిశ పుల్లయ్య, పాల్వంచలో టీజీవో, టీఎన్జీవో, పీఆర్టీయూ, యూటీఎఫ్, సీపీఎస్, టీఎస్ టీటీఎఫ్, నాల్గవ గ్రేడ్ ఎంప్లాయీస్ యూనియన్, డ్రైవర్ల సంఘం, రెవెన్యూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.