Singer Sushila! పాటకు పట్టాభిషేకం..
ఘంటసాల గానామృతం సంగీత ప్రియులను వీనులవిందు చేసింది. గాన గాంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గాత్రం నుంచి జాలువారిన ఆపాత మధురాలు శ్రోతలను ఓలలాడించాయి.
- పసందైన రోజు.. ‘ఈ భలే మంచిరోజు’
- ఘనంగా ఘంటసాల శతజయంతి సంగీత విభావరి
- ప్రముఖ గాయని సుశీలకు ఘంటసాల శతజయంతి పురస్కారం
- సినీ నటుడు సుమన్‌కు సత్కారం
ఖమ్మం కల్చరల్, డిసెంబర్ 4: ఘంటసాల గానామృతం సంగీత ప్రియులను వీనులవిందు చేసింది. గాన గాంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గాత్రం నుంచి జాలువారిన ఆపాత మధురాలు శ్రోతలను ఓలలాడించాయి. భక్తి, ప్రేమ, సందేశం, విరహం, తాత్వికం, భావాలతో కూడిన వందలాది పాటలు ప్రముఖ గాయనీ గాయకులు ఆలపించి మైమరిపించారు. సుధాస్ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఘంటసాల మధుర గాన వాహినిని ‘భలే మంచిరోజు..’ శ్రోతలకు పసందైన రోజుగా పదిలపరిచింది. ప్రముఖ నేపథ్య గాయని పద్మభూషణ్, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు విజేత పీ.సుశీల హాజరై ఘంటసాల గురించి, ఆయన పాటల నేపథ్యాన్ని గురించి నెమరువేశారు. ఉదయం స్థానిక గాయకులు, సాయంత్రం రాష్ట్రస్థాయి గాయకులు ఘంటసాల పాటలను ఆలపించారు. ప్రముఖ నర్తకి తిరుమల కాండూరి గాయత్రి ప్రదర్శించిన ఘంటసాల సంగీత నృత్యవిలాసం ఆకట్టుకుంది. సంగీత విద్వాంసుడు నారాయణ సినీ నేపథ్య గాయకుడు వినోద్‌బాబు, పవన్ చరణ్, సంతోశ్ పద్మావతి, విజయలక్ష్మి, ఎస్వీ రమణ, ప్రణవి, శ్రీలలితలు ఆలపించిన ఘంటసాల ఆపాత మధురాలు శ్రవణానందం చేశాయి.
గాయకులు ఘంటసాల పాటలను ఆలపిస్తుంటే వేదికపై డిజిటల్ తెరపై ఆ పాటకు సంబంధించిన చిత్రాన్ని ప్రదర్శించిన తీరు ఆకట్టుకుంది. గాయనీ సుశీలకు ఘంటసాల శత జయంతి పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సుశీల మాట్లాడుతూ.. తాను ఖమ్మం రావడం రెండోసారని, స్వర్గీయ ఘంటసాల జయంతిని పురస్కరించుకొని 26 సంవత్సరాలుగా భలే మంచిరోజు పేరుతో ఘంటసాల పాడిన పాటలను అందివ్వడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఐఏఎస్ అధికారి హెచ్.అరుణ్‌కుమార్ హాజరై ‘తేటతేట తెలుగులా..’ పాటను ఆలపించారు. కలెక్టర్ వీపీ గౌతమ్, వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్, ఐఆర్ఎస్ అధికారి రవి హాజరై ఘంటసాల ఆపాతమధురాల ప్రాశస్త్యాన్ని వివరించారు. సినీనటుడు సుమన్ ఘంటసాల గొప్పతనాన్ని వివరించారు. సుధాస్ ఎంటర్టైన్మెంట్స్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ టీ.వాసుదేవ్, శఠగోపం సుదర్శన్, కన్వీనర్ పంచాంగం విజయసారథి, మహ్మద్ అజీజ్, మహ్మద్ జాన్ సాహెబ్, అలీజాన్ ఆజాద్, వీవీ అప్పారావు, డాక్టర్ నాగబత్తిని రవి, కొండా లక్ష్మయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

