చవితి రోజు నుంచి నిత్య పూజలందుకున్న గణపయ్య తల్లి గంగమ్మ చెంతకు పయనమయ్యాడు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుందరంగా తీర్చిదిద్దిన మండపాల్లో కొలువుదీరి తొమ్మిది రోజులపాటు ఉదయం, సాయంత్రం అర్చకుల మంత్రోచ్ఛారణలు, భక్తుల భజనలు, ఆటపాటల నడుమ పూజలందుకున్నాడు. బుధవారం పూలు, కొబ్బరి, అరటి ఆకులతో అలంకరించిన వాహనాలపైకి గణనాథుడిని చేర్చిన మండపాల నిర్వాహకులు మేళతాళాలు, బాణసంచా మోతలు, మహిళలు, యువతుల కోలాటాలు, యువకుల నృత్యాల నడుమ గణపతి బప్పా మోరియా.. జై బోలో గణేశ్ మహరాజ్ కీ జై.. జైజై గణేశా.. బైబై గణేశా.. అంటూ నినాదాలు చేస్తూ భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించారు. ఇళ్ల ముంగిళ్ల నుంచి వెళ్తున్న వినాయకుడి విగ్రహాలకు మహిళలు హారతులు పట్టి, టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. నిమజ్జన ప్రాంతాలైన ఖమ్మం మున్నేరు వాగు, చెరువులు, గోదావరి వద్దకు చేర్చిన వినాయకుడి విగ్రహాలకు పసుపు, కుంకుమ, పూలు చల్లి పూజలు చేసి నిమజ్జనం చేశారు.
-నమస్తే నెట్వర్క్భక్తిశ్రద్ధలతో కొనసాగిన గణనాథుడి శోభాయాత్ర
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గణనాథుల శోభాయాత్ర బుధవారం కనుల పండువగా సాగింది. తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన భక్తులు గణపయ్యను పూలతో అలంకరించిన వాహనంలో ప్రతిష్ఠించారు. మేళతాళాలు, మహిళల కోలాటాలు, యువకులు, చిన్నారుల నృత్యాల నడుమ గంగమ్మ చెంతకు చేర్చారు. పసుపు, కుంకుమతో పూజలు చేసి జైజై గణేశా.. బైబై గణేశా అంటూ వీడ్కోలు పలికారు. ఖమ్మం నగరంతోపాటు రూరల్ మండలం, పాలేరు, నేలకొండపల్లి, కూసుమంచి, వైరా, పాల్వంచ, గుండాల, మణుగూరు, అన్నపురెడ్డిపల్లి మండలాల్లోని గణపతి విగ్రహాలను పాలేరు రిజర్వాయర్, ఆకేరు, మున్నేరు, భద్రాచలంలోని గోదావరితోపాటు సమీపంలోని చెరువులు, వాగులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. ఖమ్మం మున్నేరు వాగు వద్ద ఏర్పాట్లను కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్, అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్ పర్యవేక్షించారు. భద్రాచలం గోదావరి వద్ద ఏఎస్పీ పరితోష్ పంకజ్, ఆర్డీవో మంగీలాల్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
-నమస్తే నెట్వర్క్