భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. ఒక్కో రంగం కుదేలవుతూ వస్తున్నది. గత బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపారు. అందుకోసం రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు.. మరెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఫలితంగా అన్నివర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయి. ముఖ్యంగా చెరువులను బాగు చేయడంతో అటు వ్యవసాయ రంగంతోపాటు మత్స్యరంగం బాగా అభివృద్ధి చెందాయి. ప్రజలకు ఏమికావాలో అవి కేసీఆర్ ప్రభుత్వం సకాలంలో అందించేది.
కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. మత్స్యకారులను పూర్తిగా విస్మరించింది. చేపపిల్లలను సమయానికి పంపిణీ చేయకుండా ఎప్పటికో ఆలస్యంగా చేస్తున్నది. దీంతో సీజన్ అంతా అయిపోయాక చేపలు చేతికొస్తుండడంతో పెద్దగా ఉపయోగం లేకుండాపోతున్నది. జూన్ నెల చివరికి వచ్చినా ఇంతవరకు చేపపిల్లల టెండర్లు పూర్తికాలేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది కూడా సీజన్ చివరిలో అరకొరగా చేపపిల్లలను పంపిణీ చేసి మమ అనిపించడం గమనార్హం.
కులవృత్తిని నమ్ముకొని జీవనం సాగించిన మత్స్యకారుల జీవితాల్లో గత కేసీఆర్ ప్రభుత్వం వెలుగులు నింపింది. చెరువులు నిండిందే తడవుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా 763 చెరువుల్లో 1.81 కోట్ల చేపపిల్లలను ప్రభుత్వం పంపిణీ చేయగా.. అధికారులు వాటిని చెరువుల్లో పోశారు. అవి ఎదిగొచ్చిన తర్వాత పండుగ వాతావరణంలో మత్స్యకారులు వేట సాగించి ఏ లోటూ లేకుండా కుటుంబాలను పోషించుకున్నారు. పిల్లలను చదివించుకున్నారు. పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లల వివాహాలు చేశారు.
కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. మత్స్యకారుల జీవితాల్లో చీకట్లు కమ్ముకునే పరిస్థితులు నెలకొన్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వం ఏటా 1.81 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేస్తే.. కాంగ్రెస్ సర్కారు గత ఏడాది కేవలం 80 లక్షల చేపపిల్లలు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నది. దీంతో గత ఏడాదే కాంగ్రెస్ సర్కారుపై నమ్మకం కోల్పోయిన మత్స్యకారులు అప్పోసప్పో చేసి చేపపిల్లలు కొనుగోలు చేసి చెరువుల్లో పోసేందుకు సిద్ధమవుతున్నారు.
గత కేసీఆర్ సర్కారు 2014లో అధికారంలోకి వచ్చీరాగానే చెరువులు, కుంటలను అభివృద్ధి చేసింది. ఏళ్లనాటి చెరువులు, కుంటలకు మిషన్ కాకతీయతో పూర్వవైభవం తీసుకొచ్చింది. పూడిక తీయడంతోపాటు చెరువు కట్టలు, తూములను మరమ్మతు చేయించింది. నీటి నిల్వ సామర్థ్యంతో అటు సాగుకు, ఇటు చేపల పెంపకానికి అనువుగా ఉండే విధంగా చర్యలు చేపట్టింది.
అంతేకాక వేసవిలో సైతం చెరువులు జలకళతో నిండుకుండలా కనిపించేవి. ఈ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం 2017 నుంచి మత్స్య సహకార సంఘాలను బలోపేతం చేసి జిల్లాలో 58 సంఘాలను అందుబాటులోకి తెచ్చింది. 3,200 మంది సభ్యులకు సభ్యత్వం కల్పించింది. క్రమేపీ ఆ సంఘాలు ఇప్పుడు 78కి చేరగా.. సభ్యులు 3,548కి పెరిగినా.. మత్స్య సంపదను పెంచడంతో కాంగ్రెస్ సర్కారు విఫలమైందనే చెప్పాలి. అయితే వానకాలం వచ్చినా ఈ ఏడాది చేపపిల్లల పంపిణీ జరుగుతుందా? లేదా? అని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
గత ఏడాది సీజన్ వచ్చినా చేపపిల్లల జాడ లేకపోవడంతో ఇక పంపిణీ చేయరనే నిర్ణయానికి మత్స్యకారులు వచ్చారు. కానీ.. చివరి సమయంలో ఇచ్చాం అనిపించుకోవడం కోసం గత ప్రభుత్వం ఇచ్చిన వాటిలో 50 శాతం మాత్రమే చేపపిల్లలు పంపిణీ చేసి మమ అనిపించారు. అయితే ఈ ఏడాది పరిస్థితి ఎలా ఉంటుందోనని మత్స్యకారులు ఇప్పటి నుంచే దిగులు చెందుతున్నారు. సీజన్ దాటిపోతున్నా టెండర్ల ప్రక్రియ ఉంటుందా? ఉండదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ముందస్తు ప్రణాళికతో వెళ్తేనే చేపపిల్లల పంపిణీకి అవకాశం ఉంటుందని, లేదంటే ఇచ్చినా ఉపయోగం ఉండదని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లావ్యాప్తంగా 763 చెరువులు ఉండగా.. వాటిలో 3 రిజర్వాయర్లు. ఒకటి తుమ్మల చెరువు, తాలిపేరు, పెదవాగు ప్రాజెక్టు ఉన్నాయి. 77 పెద్ద చెరువులు, 683 సీజనల్ చెరువులుగా గుర్తించారు. 763 చెరువుల్లో 1.81 కోట్ల చేపపిల్లలు పోయాల్సి ఉండగా.. ఏటా రూ.కోటి వ్యయంతో 1.71 కోట్ల చేపపిల్లలను వదులుతున్నారు. దీంతో 2017 నుంచి 2023 వరకు మత్స్య సంపదకు అడ్డులేకుండా చెరువుల్లో పుష్కలంగా పెరిగాయి. కానీ.. ఇప్పుడు చేపాచేపా నువ్వెక్కడా అంటే నా అడ్రస్ దొరుకుతుందా? అన్నట్లుంది పరిస్థితి.
కొత్త ప్రభుత్వం వచ్చిందంటే ఇంకా ఎక్కువ చేపపిల్లలు ఇస్తారేమో అనుకున్నా. కానీ.. సగం చేపపిల్లలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వర్షాలతో చెరువు అలుగుల్లో కొన్నిపోతే.. కొన్ని రద్దు పోతే.. మిగిలినవి పావువంతే అయ్యాయి. చెరువు సామర్థ్యాన్ని బట్టి చేపపిల్లలు ఇవ్వాలి. లేదంటే అసలు ఇవ్వకపోయినా పర్వాలేదు. వేరే పనులు చేసుకొని బతుకుతాం. ఇప్పటివరకు ఇస్తారో? ఇవ్వరో? అనేది కూడా చెప్పలేదు.
– ముడిగ నర్సింహారావు, మత్స్య సొసైటీ అధ్యక్షుడు, రామచంద్రునిపేట, టేకులపల్లి మండలం
గత ఏడాది సీజన్ దాటాక సగం చేపపిల్లలే ఇచ్చారు. సభ్యులకు కూలి కూడా గిట్టుబాటు కాలేదు. చేపల వేట కొనసాగించి వాటిని అమ్మాలంటే చాలా కష్టమైన పని. చెరువుల్ని నమ్ముకుని జీవిస్తున్నాం. ఇంకా రెండు నెలలు దాటితే ఇచ్చినా.. ఇవ్వకపోయినా ఒకటే. నాసిరకం చేపపిల్లలకు బదులు డబ్బులిస్తే మేమే మంచి చేపపిల్లలు తెచ్చుకుని చెరువుల్లో పోసుకుంటాం. గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఇంత ఇబ్బంది కలగలేదు.
– బానోత్ సూర్యం, శింగభూపాలెం సొసైటీ అధ్యక్షుడు, కొమ్ముగూడెం, జూలూరుపాడు మండలం
గత ఏడాది జిల్లాలో 80 లక్షల చేపపిల్లలు పంపిణీ చేశాం. ఈ ఏడాది ఇంతవరకు చేపపిల్లల మీద స్పష్టత రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా టెండర్ల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. టెండర్లు పూర్తయితే ఎంత ఇస్తారు అనే దానిపై స్పష్టత వస్తుంది. జిల్లాలో మత్స్య సహకార సంఘాలను బలోపేతం చేస్తున్నాం. జిల్లాలో 78 సంఘాలు ఉన్నాయి. 3,548 మంది సభ్యులు ఉన్నారు. ఇంకా సంఘాలను ఏర్పాటు చేస్తున్నాం.
– ఎండీ.ఇంతియాజ్, జిల్లా మత్స్యశాఖ అధికారి