కొత్తగూడెం అర్బన్/ అశ్వారావుపేట రూర ల్, సెప్టెంబర్ 26: ఏళ్లతరబడి ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములను వారికే అప్పగించాలని, వారిపై అటవీ శాఖ అధికారుల దాడులు, దౌర్జన్యాలను అరికట్టాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి నర్సయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాము సాగు చేసుకుంటున్న భూములు తమకే అప్పగించాలని కోరుతూ అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీలు భద్రాద్రి జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక దీక్షలు శుక్రవారం ఐదో రోజుకు చేరాయి. దీక్షా శిబిరాన్ని గుమ్మడి నర్సయ్య, మాస్‌లైన్ రాష్ట్ర నాయకుడు కెచ్చల రంగారెడ్డిలు సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ 1981, 1986, 1990, 1996 సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వం 107 మంది రైతులకు పట్టాలు ఇచ్చిందని, ఆయా రైతులందరికీ రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు కూడా అందుతున్నాయన్నారు. అయినా అటవీ శాఖ అధికారులు ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పంటలను ధ్వంసం చేస్తూ.. వారిపై దౌర్జన్యం చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై కలెక్టర్ దృష్టి సారించి వారికి న్యాయం చేయాలని కోరారు. లేదంటే ఆదివాసీలతో కలిసి పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ముద్దా భిక్షం, అమర్లపూడి రాము, జాటోతు కృష్ణ, గోకినపల్లి ప్రభాకర్, బానోతు ధర్మా, ఆదివాసీ రైతులు పాల్గొన్నారు. అలాగే శిబిరాన్ని ఎమ్మార్పీఎస్ నాయకులు సందర్శించి, ఆదివాసీలకు సంఘీభావం తెలిపారు. సమస్యను పరిష్కరించే వరకూ తమ మద్దతు ఉంటుందని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి రవి మాదిగ తెలిపారు.