టేకులపల్లి, ఆగస్టు 20 : రైతులందరికీ ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, అర్హులందరికీ రుణమాఫీ చేసే వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల తరఫున పోరాడతామని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్‌రోడ్ రైతువేదికలో రెండులక్షలు రుణమాఫీ కాని రైతుల వద్ద నుంచి వ్యవసాయశాఖ అధికారులు తీసుకుంటున్న ఫిర్యాదుల కార్యక్రమాన్ని పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు.
రుణమాఫీ కాని రైతుల పలురకాల సమస్యలను వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రాజకీయ లబ్ధి పొంది, ఇప్పుడేమో షరతులు పెట్టి రైతులను మోసం చేస్తున్నదన్నారు. బ్యాంకు లోన్ ఇచ్చేటప్పుడు లేని షరతులు రుణమాఫీ దగ్గర ఎందుకని ప్రశ్నించారు. అసలే ఈ ఏడాది సరైన వర్షాలు లేక ప్రభుత్వం రైతుభరోసా ఇవ్వక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులను రెండు లక్షలకంటే ఎక్కువ ఉన్నవాళ్లు కట్టాలంటే ఎలా కడతారని ప్రశ్నించారు.
రైతుల బాధలను గుర్తించి ఎలాంటి షరతులు లేకుండా అర్హులందరికీ రెండు లక్షల మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఇల్లెందు నియోజకవర్గ రైతుల తరఫున రుణమాఫీ, రైతుభరోసా, రోళ్లపాడు ప్రాజెక్టుకు నీళ్లు అందించి నియోజకవర్గం మొత్తం సీతారామ ప్రాజెక్టు నీళ్లు అందేవరకు పోరాటం చేస్తానని హెచ్చరించారు. కార్యక్రమంలో బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్‌రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొమ్మెర వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి బోడ బాలు, నాయకులు బానోత్ కిషన్, బర్మావత్ శివకృష్ణ, లాలు, జోగ లక్ష్మణ్, భిక్షం, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు మాలోత్ శివ, వివిధ పార్టీల నాయకులు, రైతులు పాల్గొన్నారు.