ఖమ్మం, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే మరో ఉద్యమం తప్పదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో ఆదివారం పర్యటించిన ఆయన.. ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేయకుంటే తిరుగుబాటు తప్పదని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో 60 శాతం జనాభా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీలు ద్వందవైఖరి అనుసరిస్తున్నాయని విమర్శించారు.
బీసీల రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లు పెడితే తమ బీఆర్ఎస్ పార్టీ బేషరతుగా మద్దతు తెలిపిందని గుర్తుచేశారు. గవర్నర్ ఆమోదానికి బిల్లు పంపిన కాంగ్రెస్ ప్రభుత్వం.. దానిని ఆమోదింపచేసుకోవడంలో చిత్తశుద్ధితో లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ సైతం పార్లమెంటులో తమ వాదన వినపించడంలో చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మూడేళ్ల తరువాత అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ పాలన ఎంతో బాగుందని, సంక్షేమ పథకాలు ప్రజలకు సకాలంలో అందాయని గుర్తుచేశారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒకరినొకరు కాపాడుకునేందుకు పని చేస్తున్నారని, బీజేపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు బదలాయించేందుకు వారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పరస్పర అంగీకరంతో పని చేశారని విమర్శించారు.
బీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీజేపీలతోపాటు ఎంఐఎం కూడా పని చేస్తోందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే బీఫాంతో కాదని, రాజ్యాంగపరంగా 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, నాయకులు ఉప్పల వెంకటరమణ, డోకుపర్తి సుబ్బారావు, పగడాల నరేంద్ర, షకీనా, ఆరెంపుల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.