ఖమ్మం, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. జిల్లాకు ముగ్గురు మంత్రులుండి కూడా ముంపు బాధితులను ఆదుకోలేకపోయారని దుయ్యబట్టారు. మున్నేరు వరదలపై ప్రభుత్వానికి ముందు జాగ్రత్త లేకపోవడం వల్లనే ఇంతటి నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తొలుత అజయ్‌కుమార్ మాట్లాడారు.
మున్నేరు వరద సహాయక చర్యల్లోనూ, ప్రజలను ముందుగా అప్రమత్తం చేయడంలోనూ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండేవాళ్లమని గుర్తుచేశారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం మంచినీళ్లు ఇచ్చేవారు కూడా లేకపోవడం దారుణమని అన్నారు. వరదల్లో మృతిచెందిన వ్యక్తుల కుటుంబానికి ఒక్కొక్కరికీ రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని, ప్రతి కుటుంబానికీ రూ.2 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ‘ఖమ్మం ప్రజలు ధైర్యంగా ఉండాలి.
మీ తరుఫున బీఆర్ఎస్ పోరాడుతుంది’ అని భరోసా ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. ముంపునకు గురైన ప్రాంతాల్లో ఇళ్లన్నీ బురదతో నిండి ఉన్నాయని, పాములు సంచరిస్తున్నాయని అన్నారు. సర్వస్వం కోల్పోయి రోడ్డున పడిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరద కారణంగా ప్రాణాలు కోల్పోయిన తొమ్మిది మందికి తమ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామన్నారు. దెబ్బతిన్న ఇళ్లకు తక్షణ సహాయంగా రూ.2 లక్షలు, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, నిత్యావసర వస్తువులు అందజేయాలని డిమాండ్ చేశారు.
సహాయక చర్యల్లో బీఆర్ఎస్ శ్రేణులు చురుగ్గా పని చేస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ వరద నష్ట నివారణలోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, బచ్చు విజయ్‌కుమార్, పగడాల నాగరాజు, బీరెడ్డి నాగచంద్రరెడ్డి, బొమ్మెర రామ్మూర్తి, శీలంశెట్టి వీరభద్రం, తోట రామారావు, తోట వీరభద్రం, నాగండ్ల కోటేశ్వరరావు, రోజ్లీనా, జ్యోతిరెడ్డి, కూరాకుల వలరాజు, దేశభక్తిని కిశోర్ తదితరులు పాల్గొన్నారు.