రఘునాథపాలెం, ఆగస్టు 22: ‘తెలంగాణ తల్లి.. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్’ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర సచివాలయం ఎదుట ఆ పార్టీ నేత విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని చూస్తుండడం ఆక్షేపణీయమని అన్నారు. రైతు ధర్నా కోసం మంచుకొండ గ్రామానికి వెళ్లేందుకు ముందుగా ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి గురువారం ఆయన క్షీరాభిషేకం చేసి పూలమాల వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సచివాలయం ప్రాంగణంలో ఉన్న తెలుగుతల్లి విగ్రహాన్ని రోడ్డు వెడల్పులో భాగంగా తొలగించి ఆ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు ఆలోచన చేసిందని అన్నారు. తాము తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలనుకున్న ఆ ప్రదేశంలో నేటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకుడి విగ్రహాన్ని పెట్టాలని అనుకుంటోందని విమర్శించారు. తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌గా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటుచేయకుంటే రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.