ఖమ్మం సిటీ, జూన్ 20 : ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని బుగ్గపాడు ఫుడ్ పార్క్‌లో మరో భారీ భూ దోపిడీ జరిగిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మార్కెట్ విలువకు విరుద్ధంగా అనుయాయుల ప్రైవేట్ కంపెనీకి ఫుడ్ పార్క్ భూములను కారుచౌకగా కట్టబెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అవినీతి, అక్రమాలపై పారదర్శకంగా సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ హయాంలో ఫుడ్ పార్క్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేసిన సంగతిని గుర్తుంచుకోవాలన్నారు. అదేవిధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా సీతారామ ప్రాజెక్టు కాలువ మట్టిని, కలపను అక్రమంగా తరలిస్తూ కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఖమ్మం జిల్లాలో భూ దందాలు, మట్టి, ఇసుక మాఫియాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం నోరు మెదపడంలేదన్నారు. తక్షణమే అన్నిరకాల అక్రమాలపై విచారణ జరిపి దోషులను తేల్చి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.