రైతు రుణమాఫీ కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. రేవంత్ సర్కార్ మెడలు వంచి రైతులకు న్యాయం చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఆంక్షల్లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. రుణమాఫీ జరగని రాష్ట్ర రైతులకు బాసటగా నిలవాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులన్నీ కదం తొక్కాయి. రైతులతో కలిసి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మోసానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఖమ్మం, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండలో జరిగిన రైతు ధర్నాలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొన్నారు. ‘సీఎం డౌన్ డౌన్.. రైతులకు రుణమాఫీ చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలి. .రైతులను దగా చేసిన రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్.. రైతులకు మాయమాటలు చెప్పి మోసగించిన సీఎం రాజీనామా చేయాలి..’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సత్తుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మణుగూరులో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, అశ్వారావుపేటలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. రుణమాఫీ పేరిట కర్షకులకు కాంగ్రెస్ చేసిన మోసంపై కడిగిపారేశారు.
ఖమ్మం ధర్నాలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలనూ అమలుచేయాలని, అందులో ప్రధానమైన రుణమాఫీని చివరి రైతు వరకూ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. రూ.2 లక్షల రుణమాఫీ చేసే వరకూ బీఆర్ఎస్ కచ్చితంగా పోరాడుతుందని స్పష్టం చేశారు. ఉద్యమ నేత కేసీఆర్‌కుగానీ, బీఆర్ఎస్కుగానీ పోరాడడం కొత్తేమీ కాదని స్పష్టం చేశారు. విక్రమార్కుడు సినిమాలో సగం గుండు కొట్టి.. మిగిలిన గుండుకు రూ.వెయ్యి అడిగిన చందంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ తీరు ఉందని ఎద్దేవా చేశారు. రుణమాఫీపై అనేక ఆంక్షలు పెట్టి రైతులను మోసగించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసేంతవరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌వి 420 హామీలని, ఆరు గ్యారెంటీల్లో అన్నీ కోతలేనని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు కూరాకుల నాగభూషణం, ఆర్జేసీ కృష్ణ, బచ్చు విజయ్‌కుమార్, బొమ్మెర రామ్మూర్తి, పగడాల నాగరాజు, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, అజ్మీరా వీరూనాయక్, గుత్తా రవి, మద్దినేని వెంకటరమణ, భుక్యా లక్ష్మణ్‌నాయక్, నాగండ్ల కోటి, దేవభక్తుని కిశోర్‌బాబు, చిలుమూరు కోటేశ్వరరావు, హెచ్ ప్రసాద్, దండా జ్యోతిరెడ్డి, తొలుపునూరి దానయ్య, దొంతు సత్యనారాయణ, వాంకుడోతు సురేశ్, మేడబోయిన పెద్ద మల్లేశం, జాఠోతు సూర్యం, కాంపాటి రవి, శీలంశెట్టి వీరభద్రం, తంగెళ్లపల్లి శ్రీను, తీగల సతీశ్‌గౌడ్, మిరియాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు టౌన్, ఆగస్టు 22: కర్షకుల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటమాడుతోందని పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు విమర్శించారు. రైతు రుణమాఫీ విషయంలో నోటికొచ్చింది చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రైతులను నిలువునా మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మణుగూరులో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తొలుత భారీ ర్యాలీ నిర్వహించారు. తరువాత తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కార్యాలయ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ.. రుణమాఫీ కోసం రూ.40 వేల కోట్లు అవసరమంటూ అధికారంలోకి వచ్చిన కొత్తలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. క్యాబినెట్లో మాత్రం కేవలం రూ.31 వేల కోట్లకే అనుమతినిచ్చారని విమర్శించారు. ఇక బడ్జెటలో రూ.26 వేల కోట్లు కేటాయించి ఇప్పుడు కేవలం 17 వేల కోట్లే ఖర్చు చేశారని దుయ్యబట్టారు. కానీ రూ.7,500 కోట్లతో రుణమాఫీ చేసి రైతులను నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. ప్రతి వందమంది రైతుల్లో పది మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదని అన్నారు. దీంతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు వట్టం రాంబాబు, కుర్రి నాగేశ్వరరావు, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, ముత్యం బాబు, ముద్దంగుల కృష్ణ, ప్రభుదాస్, మడి వీరన్న, చెన్నకేశవరావు, రవి, జావీద్‌పాషా, గుర్రం సృజన్, బోశెట్టి రవి తదితరులు పాల్గొన్నారు.