మామిళ్లగూడెం, మే 9: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులు, మెప్మా బాధ్యులు, ఎఫ్పీవో సభ్యులు, నిరుద్యోగ యువతీ యువకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వాలు చేయూతనిస్తున్నాయని అన్నారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి పథకం – తయారీ సంస్థల క్రమబద్ధీకరణ కింద జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 13న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ మిషనరీ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. ఇందుకోసం ఔత్సాహికులు ముందుకు రావాలని కోరారు. అర్హులైన వారికి ప్రభుత్వం 35 శాతం సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాన్ని మంజూరు చేస్తుందని వివరించారు. ఔత్సాహికులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని పరిశ్రమలను ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో ఉమ్మడి జల్లాలో అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ప్రజల అవసరాలకు సరిపడా ఆహార ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని అన్నారు.