తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 4 : వరదలతో నష్టపోయిన బాధితులకు తనవంతుగా సాయం అందిస్తానని, ఎవరూ అధైర్యపడొద్దని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఆకేరు వరద ప్రవాహంతో తీవ్రంగా నష్టపోయిన రాకాశితండా, రావిచెట్టుతండాలను బుధవారం ఆయన సందర్శించారు. ఇళ్లు మునిగిపోయిన బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
ఆకేరు వరద ఉధృతి వల్ల ఇసుక మేటలు మేసిన వరి పొలాలను ఆయన పరిశీలించారు. జల్లేపల్లి హైస్కూల్లోని పునరావాస కేంద్రంలో ఉన్న రాకాశితండా వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. రావిచెట్టుతండా వద్ద కొట్టుకుపోయిన బ్రిడ్జిని పరిశీలించారు. అనంతరం బీరోలు చెరువు తెగి ముంపునకు గురైన బందంపల్లి దళిత కాలనీవాసులను పరామర్శించారు.
బాధితులకు సాయంత్రంలోగా వారం రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేయాలని పార్టీ శ్రేణులను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు బాషబోయిన వీరన్న, దేవరం దేవేందర్‌రెడ్డి, నాయకులు చావా వేణు, చామకూరి రాజు, ఆలస్యం నాగేశ్వరరావు, ఆర్మీ రవి, తాతా రవీందర్, బోడ మంచానాయక్, వంచర్ల సత్యనారాయణరెడ్డి, పరికపల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.