భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు జిల్లాలోని పలు మండలాల్లో గురువారం కురిసిన వర్షానికి జలాశయాలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను దాటి.. గురువారం సాయంత్రానికి 45.1 అడుగులకు నీటిమట్టం చేరింది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు 21 గేట్లు ఎత్తడంతో 94 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. కిన్నెరసానిలోకి 20 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా.. అధికారులు నాలుగు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.
జిల్లాలోని చండ్రుగొండ మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. అత్యధికంగా అశ్వాపురం మండలంలో 77 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆళ్లపల్లి 64, గుండాల 63.6, భద్రాచలం 62, మణుగూరు 52, దుమ్ముగూడెం 46, ములకలపల్లి 40, కరకగూడెం 40, టేకులపల్లి మండలాల్లో 21 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గుండాలలో ఏడు మెలికల వాగు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
తాలిపేరు ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరింది. దీంతో 21 గేట్లు ఎత్తడంతో 94 వేల క్యూసెక్కుల నీరు గోదావరిలో కలిసింది. దీంతో గోదావరిలో నీటి ప్రవాహం మరింతగా పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా తాలిపేరులో భారీగా నీరు చేరుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
బుధవారం రాత్రి దంతెలబోర, కిన్నెరసాని వాగులు పొంగి ప్రవహించడంతో పశువుల కాపరులు ఏడుగురు వరదలో చిక్కుకున్న విషయం తెలిసిందే. రాత్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో వారిని బయటకు తీయగలిగారు. అయితే ప్రమాదవశాత్తు అందులో ఒక వ్యక్తి వాగులో గల్లంతయ్యాడు.
రాత్రంతా వెతికినా ఆచూకీ లభించకపోవడంతో గురువారం ఉదయం స్థానికులు వెతకడానికి వెళ్లి వాగు మధ్యలో చిక్కుకున్నారు. దీంతో అధికారులు సిబ్బందిని అలర్ట్ చేసి డ్రోన్ల సహాయంతో వాగు మధ్యలో చిక్కుకున్న ఐదుగురికి ఆహార పొట్లాలతోపాటు లైఫ్ జాకెట్లను అందించారు. తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందం అక్కడికి చేరుకుని చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చారు. రాత్రి గల్లంతైన వ్యక్తి ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడంతో ఇంటి వద్ద భార్యాపిల్లలు రోదిస్తున్నారు.