ఖమ్మం రూరల్, జూన్ 03 : ఏదులాపురం మున్సిపాలిటీ వార్డుల విభజనకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఐదు రోజుల లోపు కార్యాలయంలో అభ్యంతరాలను తెలియజేయొచ్చని మున్సిపాలిటీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ కార్యాలయంలోని తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ నూతనంగా ఏర్పాటు చేయబోయే వార్డుల విభజనకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నూతన మున్సిపాలిటీలో 32 డివిజన్లను ఏర్పాటు చేసి డ్రాఫ్ట్ తయారు చేయడం జరిగిందన్నారు. పూర్వపు 12 పంచాయతీల సమూహంతో ఇప్పటికే ప్రభుత్వం ఏదులాపురం మున్సిపాలిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
పాలనా సౌలభ్యం కోసం గత కొద్ది రోజుల క్రితం బీఎల్ఓ ల సహాయంతో డివిజన్ల ప్రక్రియ చేపట్టి ముసాయిదా తయారు చేసినట్లు వెల్లడించారు. డివిజన్ల ఏర్పాటుతో పాటు మున్సిపాలిటీ ముఖ చిత్రం సంబంధించిన మ్యాపులు సైతం రూపొందించినట్లు వివరించారు. నూతనంగా ఏర్పాటు చేసిన డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్న ప్రజలు దరఖాస్తుల ద్వారా వారి అభిప్రాయాలను తెలియజేయవచ్చు అని తెలిపారు. తయారుచేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను 4వ తేదీన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీలకు అందజేయడం జరుగుతుందన్నారు. 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు చెప్పారు.
12వ తేదీ నుండి 16వ తేదీ వరకు స్వీకరించిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో మరోమారు విచారణ చేయడం జరుగుతుందని, 17వ తేదీన తుది ముసాయిదాను జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 19వ తేదీన అప్రూవల్ నిమిత్తం రాష్ట్ర మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ కు పంపించడం జరుగుతుందన్నారు. అప్రూవల్ వచ్చిన వెంటనే 21వ తేదీన అధికారికంగా డివిజన్ల ఏర్పాటుకు సంబంధించిన తుది డ్రాఫ్ట్ వివరాలను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని ప్రజలు తమ అభ్యంతరాలను నిర్ణీత గడువులోగా తెలియజేయాలని కమిషనర్ కోరారు.