యాసంగి సన్నాలకు బోనస్ సంగతి భద్రాద్రి జిల్లాలో పత్తా లేకుండా పోయింది. వానకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటినా గడిచిన యాసంగి నాటి బోనస్ నగదు మాత్రం రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇంకా జమ కాలేదు. దీంతో ‘బోనస్ వస్తుందో? రాదో?’ అనే సందిగ్ధంతో జిల్లా రైతులు ఉన్నారు. రెండు నెలలుగా ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు.
-అశ్వారావుపేట, జూలై 16
క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామంటూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ను అన్నదాతల అక్కున చేర్చుకొని అధికారంలో కూర్చోబెట్టారు. ఆ తరువాత ‘సన్నాలకే రూ.500 బోనస్’ అంటూ రేవంత్ సర్కారు మాటమార్చి దొడ్డు రకానికి ఎగనామం పెట్టింది. దీంతో మండిపడిన రైతులు.. తరువాతి సీజన్(గడిచిన యాసంగి)లో సన్నాలను అత్యధికంగా సాగు చేశారు. దీంతో దిగుబడి కూడా బాగానే వచ్చింది. ప్రకృతి విపత్తులు ఒకవైపు, ప్రభుత్వ నిర్లక్ష్యం మరోవైపు ఆవహించినా అన్నదాతలందరూ అష్టకష్టాలు పడి ధాన్యాన్ని కాపాడుకున్నారు.
చాలా ధాన్యం వర్షపునీళ్ల పాలైనప్పటికీ మిగిలిన దానిని కాపాడి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. అప్పటి నుంచి క్వింటాకు రూ.500 బోనస్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. రైతు తన ధాన్యాన్ని విక్రయించిన 24 గంటల్లోనే అతడి బ్యాంకు ఖాతాలో బోనస్ నగదును జమ చేస్తున్నామంటూ యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రారంభం నుంచి ఆర్భాటంగా ప్రచారం చేస్తున్న ప్రభుత్వం.. ఆచరణలో పూర్తిగా విఫలమైంది. రెండు నెలలు దాటినా బోనస్ జమ చేసిన పాపానపోలేదు.
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా యాసంగిలో సుమారు 72,577 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందులో 36,560 ఎకరాల్లో సన్నాలు పడించారు. అధికారిక లెక్కల ప్రకారం సన్నరకం ధాన్యం దిగుబడి అంచనా 91,400 మెట్రిక్ టన్నులు. కానీ, ప్రభుత్వం సేకరించింది 36,950 మెట్రిక్ టన్నులు మాత్రమే. మిగతా ధాన్యాన్ని రైతులు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సర్కారు పెట్టిన తిప్పలు తాళలేక బోనస్ లేకపోయినా పర్వాలేదని వ్యాపారులకు తెగనమ్ముకున్నారు.
భద్రాద్రి జిల్లాలో 36,017 ఎకరాల్లో దొడ్డు రకాన్ని సాగు చేసిన రైతులు.. 97,246 మెట్రిక్ టన్నులు దిగుబడి సాధించారు. కానీ.. జిల్లా పౌరసరఫరాల శాఖాధికారులు మాత్రం రైతుల నుంచి సన్నాలను 36,950 మెట్రిక్ టన్నులు, దొడ్డు రకాలను 18,293 మెట్రిక్ టన్నులను మాత్రమే సేకరించారు. మిగతా 54,450 మెట్రిక్ టన్నుల సన్నాలను, 78,953 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యాన్ని రైతులు ప్రైవేట్ వ్యాపారులకు, దళారులకు తెగనమ్ముకున్నారు.
జిల్లావ్యాప్తంగా రైతులు ఈ యాసంగిలో మొత్తం 72,577 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 36,560 ఎకరాల్లో సన్నాలు పండించారు. అధికారుల లెక్కల ప్రకారం 91,400 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం దిగుబడి సాధించారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కేవలం 36,950 మెట్రిక్ టన్నుల(9.14 లక్షల క్వింటాళ్లు) సన్నాలను మాత్రమే రైతుల నుంచి సేకరించింది. దీని ప్రకారం క్వింటాకు రూ.500 చొప్పున రూ.45.70 కోట్లను బోనస్‌గా చెల్లించాల్సి ఉంది. కానీ.. వానకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా ఇంతవరకూ బోనస్‌ను జమ చేయలేదు. దీంతో ప్రభుత్వ మాటపై నమ్మకంతో ధాన్యాన్ని విక్రయించిన రైతులు కళ్లలో ఒత్తులేసుకొని మరీ ఎదురుచూపులు చూస్తున్నారు. వానకాలం పంటల పెట్టుబడులకూ చేతిలో నగదు లేకపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాలకు ఇస్తామన్న బోనస్ నగదును ఇంకా ఇవ్వలేదు. రెండు నెలలు గడుస్తున్నా అతీగతీ లేదు. కేవలం మద్దతు ధర మాత్రమే చెల్లించింది. ఈ యాసంగి బోనస్ చెల్లింపు ఆలస్యమవుతోంది. బోనస్ నగదును ప్రభుత్వం ఎప్పుడు అందిస్తుందోనని ఎదురుచూస్తున్నా.
-చిలుకూరి రాంబాబు, రైతు, అశ్వారావుపేట
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే గిట్టుబాటు ధరతోపాటు బోనస్‌ను కూడా కర్షకులకు చెల్లించాలి. కానీ.. చెల్లించలేదు. యాసంగి బోనస్ సకాలంలో చెల్లించి ఉంటే వానకాలం పంటలకు అక్కరకొచ్చేది. ఇప్పుడసలు బోనస్ వస్తుందో రాదో అనే విషయం కూడా అర్థం కావట్లేదు.
-లింగంకుంట కృష్ణ, రైతు, అశ్వారావుపేట