ఖమ్మం రూరల్, డిసెంబర్ 29 : ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఫెర్టిలైజర్ యాప్ సర్వర్ సమస్యతో జిల్లా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఆరంభం అయిన కానుంచి యూరియా కోసం అన్నదాతలు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. గడిచిన వారం రోజుల నుండి సొసైటీ గోడౌన్ల వద్ద ఎరువుల కోసం రైతులు బారులు తీరుతున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ సోమవారం ఉదయం నుండి రైతులు ముందస్తుగా ఫెర్టిలైజర్ యాప్ ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకుంటేనే యూరియా పంపిణీ చేయడం జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దీంతో సోమవారం తెల్లవారుజాము నుంచి రైతులు యాప్లు డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకుని ప్రయత్నాలు ప్రారంభించారు. ఉదయం కొద్ది మంది రైతులకు మాత్రమే యాప్ లో యూరియా బుకింగ్ కాగా పది నిమిషాల వ్యవధిలోని సర్వర్ డౌన్ కావడంతో ఏ ఒక్క రైతుకు ఓటీపీ రాని పరిస్థితి నెలకొంది.
దీంతో సొసైటీలకు రాలేక యాప్ లో యూరియా బుకింగ్ కాక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే మక్కా, వరినాట్లు వేసుకున్న రైతులు పంటను కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ యూరియా లభ్యత లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులపై వ్యవసాయ శాఖ సహకార సంఘాల బాధ్యులను వివరణ కోరగా యాప్ లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నందున తిరిగి పాత పద్ధతిలో మాన్యువల్ గా యూరియా పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వారు తెలిపారు. అధికారుల నుండి స్పష్టమైన హామీ రాకపోవడంతో తెల్లవారుజాము నుండి సొసైటీల వద్దనే రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు.

Khammam Rural : ఫెర్టిలైజర్ యాప్ తిప్పలు.. రైతుల పడిగాపులు