జూలూరుపాడు, నవంబర్ 2 : సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ.20 లక్షలు నష్టపరిహారం ఇవ్వకుంటే, కాలువ పనులను ఎట్టిపరిస్థితుల్లోనూ జరగనివ్వమని భూనిర్వాసిత రైతులు హెచ్చరించారు. జూలూరుపాడు మండల పరిధిలోని వినోభానగర్ గ్రామ సమీపం నుంచి సీతారామ ప్రాజెక్ట్ ప్రధాన కాల్వకు అనుసంధానంగా నిర్మిస్తున్న లింక్ కెనాల్ కాల్వ పనులను శనివారం అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా పర్యటనలో భాగంగా లింక్ కెనాల్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ.20 లక్షలు అందజేస్తామని పేర్కొన్నారని, ప్రస్తుతం అధికారులు గ్రామసభ పెట్టి ఎకరానికి కేవలం రూ.13.50 లక్షలు ఇస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి తుమ్మల ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి రూ.20 లక్షలు ఇవ్వాలని, లేకుంటే పనులను జరగనివ్వమని తేల్చిచెప్పారు.
పట్టా భూములకు ఒక రేటు, ఎస్టీ, ఎస్సీ, బీసీ కులాల వారీగా వేర్వేరుగా నష్టపరిహారం అందిస్తామని అధికారులు చెప్పడం సరికాదన్నారు. అందరికీ సమానంగా నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. కాలువ పనులు జరుగుతున్న ప్రదేశంలోని జేసీబీలు, యంత్రాలను పక్కన పెట్టించి డ్రైవర్లను ఇంటికి పంపారు. రైతులకు తెలియకుండా పనులను చేపడితే రైతుసంఘాలతో కలిసి పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని పేర్కొన్నారు. పనులను అడ్డుకున్న వారిలో భూ నిర్వాసిత రైతులు గుగులోతు శ్రీనివాసరావు, గుగులోత్ రమేష్, చప్పుడు ప్రసాద్, ఎల్లంకి వెంకటేశ్వర్లు, ముదిగొండ రమేష్, సిరికొండ నర్సింహారావు, సిరికొండ నాగయ్య, బండారి మల్లయ్య, పుష్పరాజ్యం వాణి తదితరులు ఉన్నారు.