కారేపల్లి, ఏప్రిల్ 19 : భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన భూ భారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకోవాలని ఖమ్మం జిల్లా సింగరేణి మండలం తాసీల్దార్ సంపత్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం భూ భారతి చట్టంపై మండల పంచాయతీ అధికారి (ఎంపీఓ) రవీంద్ర ప్రసాద్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చట్టంలోని అంశాలపై గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
భూ సమస్యలు కలిగిన రైతులు ఏడాది కాలం లోపు భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అవగాహన సదస్సుల అనంతరం మే మొదటి వారంలో అధికారులు గ్రామాల వారీగా సదస్సులను ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరిస్తారన్నారు. భూ భారతి చట్టం ప్రకారం భూ సంబంధిత సమస్యలను నిర్దిష్ట గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. సమస్య పరిష్కారం కాకుంటే కలెక్టర్ కు లేదా సీసీఎల్ఏకు అప్పీల్ చేసుకోవచ్చని, ఈ చట్టంలో కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. భూ సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ అధికారికి, కలెక్టర్‌కు అధికారాలు కల్పించినట్లు తెలిపారు. అయినా కూడా సమస్య పరిష్కారం కాలేదని రైతులు భావిస్తే అప్పీలు చేసుకోవచ్చన్నారు.
ఆర్థిక స్థోమత లేని పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం కూడా సమకూర్చడం జరుగుతుందన్నారు. రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయం సరైంది కాదని భావిస్తే కలెక్టర్ వద్ద,కలెక్టర్ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే ల్యాండ్ ట్రిబ్యునల్ కు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. వీటికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు వెలువడనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సామినేని నరసింహారావు, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.