కొణిజర్ల, ఆగస్టు 28 : ప్రతికూల వాతావరణం, పెరిగిన పెట్టుబడులు, అందని మద్దతు ధర వెరసి పెసర రైతులు దిగాలు చెందుతున్నారు. ఈ ఏడాది వానకాలం కొణిజర్ల మండల వ్యాప్తంగా సుమారు వెయ్యి ఎకరాలకు పైగా రైతులు పెసర పంట సాగు చేశారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టినప్పటికీ సకాలంలో వర్షాలు కురవకపోవడం, అవసరం లేని సమయంలో వర్షాలు కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది.
దీంతోపాటు పెసర పంటకు మద్దతు ధర దక్కక రైతు విలవిలలాడిపోతున్నాడు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూ.8,682 ఉండగా, బహిరంగ మార్కెట్లో వ్యాపారులు రూ.6 వేలకు మించి కొనుగోలు చేయడం లేదు. దీంతో కనీసం పెట్టుబడి కూడా రాక రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఏడాది వర్షాకాలం సీజన్లో మొక్కజొన్న, మిర్చి పంట సాగు చేయదల్చిన రైతులు ముందస్తుగా దుక్కులు దున్ని పెసర చల్లారు. అందుకుగాను గడ్డిమందులు, పురుగుమందులు, ఎరువుల వాడకానికి ఒక్కో ఎకరానికి రూ.10 వేల పైబడి ఖర్చు చేశారు. గత ఏడాది ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి రాక అంతే దిగుబడి వస్తుందనే ఆశతో రైతులు పెసర పంట సాగు చేశారు.
కానీ ఈ ఏడాది వానకాలంలో ఎకరాకు ఒకటి నుంచి రెండు క్వింటాళ్లకు మాత్రమే దిగుబడి వస్తున్నది. విత్తనాలు, పురుగుమందుల పిచికారీ, ట్రాక్టర్ దుక్కులు, కోత యంత్రం తదితర పెట్టుబడులు కూడా రాని దయనీయ పరిస్థితి దాపురించింది. తీరా ఇప్పుడు స్వల్పంగా దిగుబడి వచ్చిన పంటకు మద్దతు ధర రాక, దళారులు రూ.5 వేల నుంచి రూ.6 వేలకే అడుగుతుండడంతో కర్షకుల కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి.
గతంలో నాబార్డు, మార్క్ఫెడ్ రంగంలోకి దిగి రైతుల నుంచి మద్దతు ధరకు పెసలు కొనుగోలు చేయడంతో రైతుకు కొంత గిట్టుబాటు అయ్యేది. బహిరంగ మార్కెట్లోనూ వ్యాపారులు పోటీపడి గత ఏడాది రూ.8 వేల దాక పెట్టి కొనుగోలు చేశారు. ఈ ఏడాది కొనుగోలు కేంద్రాలు సైతం అందుబాటులో లేకపోవడంతో పెసర రైతుకు తీవ్రనష్టం వాటిల్లుతున్నది. ప్రకృతి విపత్తు, ప్రభుత్వ సహకార లేమి వెరసి పెసర రైతు దివాలా తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత సర్కారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు పెసర కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకొని తమకు అండగా నిలవాలని కర్షకులు కోరుతున్నారు.
ఓ వైపు ప్రతికూల వాతావరణం, మరోవైపు పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో సాగు సంకటంగా మారింది. పెసర పంట వేసిన మొదట్లో విపరీతమైన వర్షాలతో విపరీతంగా రొట్ట పెరిగి గణనీయంగా దిగుబడి తగ్గింది. దీంతో పెసర పంట సాగు సంకటంగా మారింది.
– అడపా శంకరయ్య, రైతు, రామచంద్రాపురం
గత ఏడాది ఒక్కో ఎకరాకు 5 నుంచి 6 బస్తాల దిగుబడి రాగా రూ.8 వేల పైచిలుకు ధరతో వ్యాపారులు కొనుగోలు చేయడంతో పెసర పంట లాభదాయకంగా ఉండేది. ఈ ఏడాది ఎకరాకు రెండు బస్తాలకు మించి దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. పెట్టిన పెట్టుబడుల్లో సగం కూడా చేతికందడం లేదు. కనీసం సర్కారు కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.
– పామర్తి నాగయ్య, రైతు, సింగరాయపాలెం