టేకులపల్లి, జనవరి 28: దేశ ప్రజల చూపంతా సీఎం కేసీఆర్ వైపే ఉందని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని దేశమంతా ప్రశంసిస్తోందని అన్నారు. టేకులపల్లి మండలంలో శనివారం పర్యటించిన ఆమె.. పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. తొలుత దాస్తండా గ్రామానికి చెందిన గుగులోత్ సైదులు సాగు చేసిన మిర్చి పంట వద్దకు వెళ్లి తోటలో మిర్చి ఏరుతున్న కూలీలతో ముచ్చటించారు. కొద్దిసేపు వారితో కలిసి మిర్చి కోశారు. అనంతరం అక్కడే ఉన్న రైతుతో మాట్లాడి.. పంట సాగు, ఖర్చుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంటల సాగు కోసం గతంలో పడిన కష్టాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.
చెక్‌డ్యాముల నిర్మాణం, మిషన్ కాకతీయ వంటి వాటితో భూగర్భజలాలు పెరిగాయని, సాగునీరు పుష్కలంగా లభిస్తోందని అన్నారు. సీజన్‌కు ముందే రైతుబంధు ద్వారా పంటల పెట్టుబడి సాయం అందిస్తుండడంతో అన్నదాతలందరూ సంతోషంగా సాగు చేసుకుంటున్నారని అన్నారు. తరువాత మండలంలో తన హయాంలో నిర్మించిన చెక్‌డ్యాములను పరిశీలించారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ హరిసింగ్‌నాయక్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. మండలంలో సుమారుగా రూ.20 కోట్లతో ఎనిమిది చెక్‌డ్యాముల నిర్మాణం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు బానోత్ పూల్‌సింగ్, తాతా గణేశ్, జేకే శ్రీను, బబ్లూ, నాయకులు బానోత్ రామ, బోడ బాలు, బర్మావత్ శివకృష్ణ, జాటోత్ నరేశ్, గుగులోత్ కృష్ణ, బానోత్ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.