ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 25: వరి నాట్లు వేసింది మొదలు పంట పొట్ట దశకు చేరినా రైతులకు యూరియా తిప్పలు తప్ప డం లేదు. ప్రస్తుతం యూరియా అవసరం పత్తి, వరి పొలాలకు ఎక్కువగా ఉంది. ఖమ్మం జిల్లా పాలేరు డివిజన్ మైదాన ప్రాంతం కావడంతో కాస్త ఆలస్యంగా వరినాట్లు ప్రారంభమయ్యాయి. మరో పక్షంరోజుల్లో పొలాలు ఈనే దశకు చేరుకుంటున్నాయి. ఈ తరుణంలో చివరిసారిగా యూరియా పిచికారీ చేయాల్సి ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వారం, పదిరోజులకోసారి పంపిణీ కేంద్రాలకు యూరియా స్వల్పంగా దిగుమతి అవుతుండటంతో పంటను కాపాడుకునేందుకు రైతులు అనేక తిప్పలు పడుతున్నారు. విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పత్తి చేలలో నిలిచిన నీటిని తొలగించిన తర్వాత యూరియా చల్లాల్సి రావడంతో రైతుల కష్టాలు అన్నీఇన్నీ కావు. గురువారం ఆయా కేంద్రాలకు యూరియా వచ్చిన సంగతి తెలుసుకొని రైతులు భారీగా తరలివచ్చారు. రైతులను క్యూలైన్లో నిలబడిన తర్వాత టోకెన్లు జారీ చేసిన అధికారులు స్టాక్‌కు అనుగుణంగా పంపిణీ చేశారు. చివరి రైతులకు యూరియా రాకపోవడంతో నిరాశగా వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది.
పాల్వంచ రూరల్, సెప్టెంబర్ 25: పాల్వంచ ప్రాథమిక సహకార సొసైటీ కార్యాలయం వద్ద గురువారం రైతులు రోజంతా ఇరుకు క్యూలైన్లలో నిరీక్షించారు. దాదాపు మూడువారాల నుంచి ఇదే తంతు కొనసాగుతున్నది. ఏ రోజు లారీ ఆ రోజే అన్నట్లు అధికారులు యూరియా సరఫరా చేస్తున్నారు. సొసైటీ కార్యాలయంలో మొదటి అంతస్తులోకి వెళ్లేందుకు ఇరుకు మెట్లు ఉన్నాయి. అదే మెట్లపై నుంచి పురుషులు, మహిళా రైతులు నెట్టుకుంటూ ఆఫీసులోకి వెళ్తున్నారు. లోపల టోకెన్లు తీసుకునేందుకు మళ్లీ లైను తప్పడంలేదు.
మధిరలో 330 బస్తాలే..
మధిర, సెప్టెంబర్ 25: మధిర సహకార సంఘం వద్ద యూరియా కోసం 500 మందికి పైగా రైతులు గురువారం గంటల తరబడి పడిగాపులు కాశారు. కేవలం 330 బస్తాల యూరియా మాత్రమే పంపిణీ చేయడంతో మిగిలిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సొసైటీ పరిధిలోని ఆతూరు, నకలగరువు, జిలుగుమాడు గ్రామాల రైతులకు పోలీసు బందోబస్తు మధ్య యూరియాను పంపిణీ చేశారు.
తెల్లవారుజామునే బారులు
కారేపల్లి, సెప్టెంబర్ 25: కారేపల్లి సొసైటీ కార్యాలయం వద్దకు రైతులు యూరియా కోసం గురువారం తెల్లవారుజామునే చేరుకొని బారులుదీరారు. రైతులు ఇబ్బంది పడకుండా సొసైటీ సిబ్బంది వారు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేశారు. అయితే వెయ్యి కూపన్లు పంపిణీ చేసిన సిబ్బంది ఆ మేరకు యూరియా పంపిణీ చేశారు. మిగితా రైతులకు శుక్రవారం కూపన్లు ఇచ్చి యూరియా పంపిణీ చేస్తామని చెప్పారు.
బూర్గంపహాడ్‌లో రైతుల ఆందోళన
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): బూర్గంపహాడ్ మండలంలో యూరియా ఎరువుల కోసం రైతులు ఆందోళన బాటపట్టారు. నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం గ్రామ రైతులు ఏకంగా ఎరువుల లారీని అడ్డుకున్నారు. ఆందోళన తీవ్రతరం కావడంతో సమాచారం అందుకున్న బూర్గంపహాడ్ సహకార సంఘం సీఈవో అక్కడి చేరుకున్నారు. రైతులందరికీ యూరియా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఐదు గంటలకే క్యూలో..
తల్లాడ, సెప్టెంబర్ 25: మండలంలోని బిల్లుపాడు రైతువేదికలో యూరియా కోసం రైతులు గురువారం తెల్లవారుజామున 5 గంటలకే క్యూలైన్లో నిలబడ్డారు. మధ్యాహ్నం 12గంటల వరకు టోకెన్లు అందించకపోవడంతో నానా ఇబ్బందులు పడ్డారు. అంతాసేపు నిల్చొన్న ఆధార్‌కార్డు ఆధారంగా ఒక్కో రైతుకు ఒక్కో యూరియా బస్తా మాత్రమే పంపిణీ చేశారు. కేవలం 445 బస్తాల యూరియా మాత్రమే రావడంతో వాటిని పోలీసు బందోబస్తు మధ్య అధికారులు పంపిణీ చేశారు. బిల్లుపాడు క్లస్టర్ పరిధిలో సుమారు 2500 ఎకరాల్లో పంటలు సాగు చేయగా కేవలం 445 బస్తాలు ఎలా సరిపోతాయని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.