మధిర, ఆగస్టు 20 : షరతులు లేకుండా రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని రజకసంఘం మధిర డివిజన్ నాయకులు పాపినేని రామనర్సయ్య, మందా సైదులు డిమాండ్ చేశారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిలభారత కిసాన్ సభ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షరతులు లేకుండా రూ.2 లక్షల పైబడిన రుణమాఫీ డబ్బులు జమ చేయాలన్నారు.
చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సాంకేతిక లోపాలతో నిలిచిపోయిన రుణమాఫీకి సంబంధించిన వారి లోపాలను సవరించి రైతులకు రుణమాఫీ వర్తింప చేయాలన్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులందరికీ రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చింది. కానీ రుణమాఫీ సగానికి సగంమంది రైతులకు కూడా రైతులను అర్హులుగా ప్రకటించకపోవడం దురదృష్టకరమన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులందరికీ రుణమాఫీ అందించకపోతే పెద్దఎత్తున ఉద్యమించక తప్పదన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకుడు శీలం నరసింహారావు, యువజన సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మద్దాల ప్రభాకర్, మాదారపు ఉపేంద్ర, పడకంటి మురళి, పుచ్చకాయల కిషోర్, ఊట్ల శంకర్రావు, బాజినేని వెంకటనర్సయ్య, అమరవాది మోహన్‌రెడ్డి, మోహన్‌రావు, రైతులు పాల్గొన్నారు.