టేకులపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలోని పీఏసీఎస్ బేతంపూడి సొసైటీ వద్ద నానో యూరియా (Nano Urea) తీసుకుంటేనే యూరియా ఇస్తామని పీఏసీఎస్ ( PACS ) అధికారులు అనడంతో రైతులు, పీఏసీఎస్ అధికారుల మద్య శనివారం వాగ్వాదం చోటు చేసుకుంది. రెండు సంచులకు ఒక నానో యూరియా తీసుకోవాలని రైతులను ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆరోపించారు.
రోజుల తరబడి తిరుగుతుంటే రోజుకు ఒక్క యూరియా సంచి మాత్రమే ఇస్తున్నారని, వేసిన పంట చూసుకోవాలో లేక యూరియా కోసం తిరగాలో అర్థం కావడం లేదని వాపోయారు. క్యూలైన్లో వచ్చిన రైతులకు ఇవ్వకుండా ఫోన్ ద్వారా పక్కదారి పట్టిస్తున్నారని రైతులు ఆరోపించారు. తప్పని సరిగా నానో యూరియా తీసుకోవాలని పీఏసీఏస్ సిబ్బంది బలవంతం చేయడం దారుణమని పేర్కొన్నారు.
పంటను కోతులు ఆగం చేస్తున్నాయని, ఇటు సొసైటీ చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. పీఏసీఎస్ బేధంపూడి సొసైటీ అధ్యక్షులు లక్కినేని సురేందర్ రావు మాట్లాడుతూ యూరియాను అందరికీ సమానంగా ఇవ్వాలని సిబ్బందికి ఆదేశించినట్లు తెలిపారు. పక్క మండలాల్లో భూములు ఉండి వ్యవసాయం చేస్తున్న ఇక్కడ రైతులకు కూడా యూరియా ఇవ్వాలని స్పష్టం చేశారు.