అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీకి గత వారం రోజులుగా ఆయిల్‌పాం గెలలు పోటెత్తుతున్నాయి. దీంతో ట్రాక్టర్ల అన్‌లోడింగ్‌కు 24 గంటలకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలే ఎండలు దంచికొడుతుండడంతో వేడి తీవ్రతను తట్టుకోలేక రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం చల్లటి మంచినీళ్లను కూడా ఆయిల్‌ఫెడ్ యాజమాన్యం ఏర్పాటు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దమ్మపేటలోని హోటళ్ల నుంచి భోజనాలు తెప్పించుకొని మరీ ట్రాక్టర్ల డ్రైవర్లు, రైతులు అక్కడే రేయింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు.
– దమ్మపేట రూరల్, మే 23
పామాయిల్ పండ్ల గెలల సీజన్ ఏప్రిల్, మే నుంచి ప్రారంభమై ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఉంటుంది. పామాయిల్ గెలలు సంవత్సరమంతా కోతకు వస్తున్నప్పటికీ సీజన్లో మాత్రం మూడింట రెండొంతులు కోతకు వస్తాయి. ఈ సీజన్ ప్రారంభంలో అశ్వారావుపేట ఫ్యాక్టరీని మెయింటెనెన్స్ కోసం ఆపివేయడం ద్వారా రైతులకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో సుమారుగా 50 వేల ఎకరాల్లో పంట నుంచి పామాయిల్ గెలలు వస్తున్నాయి. ఈ గెలల ప్రాసెసింగ్ అప్పారావుపేట, అశ్వారావుపేట ఫ్యాక్టరీల్లో జరుగుతుండగా.. ప్రస్తుతం అశ్వారావుపేట ఫ్యాక్టరీ ఆపేయడంతో భారమంతా అప్పారావుపేట ఫ్యాక్టరీపై పడింది.
90 టీపీహెచ్కు చేరని ప్రాసెసింగ్..
అప్పారావుపేట ఫ్యాక్టరీని 60 నుంచి 90 టీపీహెచ్(టన్ పర్ హవర్) సామర్థ్యానికి 2023 సంవత్సరంలో విస్తరించారు. కాంట్రాక్టు పొందిన ప్రీయూనిక్ సంస్థ అధికారుల సమక్షంలో ప్రాసెసింగ్ పూర్తిచేసి కమీషనింగ్ సర్టిఫికెట్ పొందాలి. ఈ సర్టిఫికెట్ ప్రకారమే చివరి బిల్లును చెల్లించాలనేది నిబంధన. విస్తరణ పూర్తయింది, చివరి బిల్లును సైతం ఆయిల్‌ఫెడ్ చెల్లించింది. విస్తరణ పూర్తయి మూడేళ్లు దగ్గరపడుతున్నా పూర్తి సామర్థ్యం 90 టీపీహెచ్తో ఫ్యాక్టరీ పనిచేయడం లేదు. దీనిపై అత్యున్నతాధికారులెవరూ స్పందించకపోవడం రైతులపాలిట శాపంగా మారింది.
వారం రోజులుగా గెలలు రాక…
గత వారం రోజులుగా ఫ్యాక్టరీకి రైతులు ఆయిల్‌పాం గెలలు తీసుకొస్తున్నారు. 16వ తేదీన 1,258 టన్నులు రాగా.. 1,050 టన్నులు ప్రాసెస్ చేశారు. 17న 1,857 టన్నులు రాగా.. 1,000 టన్నులు, 18న 1,284 టన్నులకు.. 850 టన్నులు, 19న 1,101 టన్నులకు.. 1,100 టన్నులు, 20న 1,275 టన్నులకు.. 1,100 టన్నులు, 21న 997 టన్నులకు 1,250 టన్నులు, 22న 1,228 టన్నులు రాగా.. 1,450 టన్నులు ప్రాసెస్ చేశారు. 22వ తేదీన 72.5 టీపీహెచ్ సామర్థ్యంతో మాత్రమే ప్రాసెసింగ్ జరిగింది. ఈ గణాంకాల ప్రకారం 90 టీపీహెచ్ సామర్థ్యంతో ఫ్యాక్టరీ పనిచేస్తే రోజులో 4 గంటలు మెయింటెనెన్స్ పోనూ 20 గంటలకు 1,800 టన్నులు ప్రాసెస్ జరగాల్సి ఉండగా.. ఇది జరగలేదు. 23వ తేదీ నాటికి ఫ్యాక్టరీ ప్లాట్ఫారం మీద 3,400 మెట్రిక్ టన్నుల గెలలు నిల్వ ఉన్నాయి.
అన్‌లోడింగ్‌కు 24 గంటలు..
అశ్వారావుపేట ఫ్యాక్టరీ నడవని కారణంగా అప్పారావుపేట ఫ్యాక్టరీకి రావాల్సి వస్తోంది. ఇక్కడ అన్‌లోడింగ్‌కు 24 గంటలకుపైగా సమయం పడుతోంది. ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నాం. కనీసం చల్లటి తాగునీరు సైతం యాజమాన్యం ఏర్పాటు చేయలేదు. తాగునీరు కొనుక్కుని తాగాల్సి వస్తున్నది. భోజనం సైతం ఇక్కడ దొరకడం లేదు.
– కుదప శ్రీను, ట్రాక్టర్ డ్రైవర్, పాపిడిగూడెం, అశ్వారావుపేట
అధికారులు స్పందించాలి
మా రైతు నాకు భోజనం తెస్తున్నారు. ఎండవేడికి చల్లటి నీళ్లు తాగితే తప్ప దాహం తీరడం లేదు. అన్ లోడింగ్ అవ్వక రాత్రుళ్లు దోమలతో ఇబ్బంది పడుతున్నాము. ఫ్యాక్టరీ అధికారులు తక్షణమే స్పందించి అన్లోడింగ్ త్వరగా పూర్తి అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలి.
– ఎన్.రాఘవులు, ట్రాక్టర్ డ్రైవర్, మందలపల్లి, దమ్మపేట
లక్ష్యాన్ని చేరుకుంటాం..
అప్పారావుపేట ఫ్యాక్టరీ పూర్తి సామర్థ్యం 90 టీపీహెచ్. ఈ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటాం. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ఆయిల్‌పాం గెలల అన్ లోడింగ్‌ను వేగంగా పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకుంటున్నాం.
– నాగబాబు, ఫ్యాక్టరీ మేనేజర్