ఖమ్మం సిటీ, జనవరి 9 : ప్రజల అమాయకత్వం.. అవగాహన లేమి.. వెరసి నకిలీ వైద్యుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఆక్యూ పంచుర్, కేరళ, హెర్బల్, ఆయుర్వేదం వంటి పేర్లతో జనాల జేబులు లూటీ చేస్తున్నారు. ఏమాత్రం అర్హత లేకపోయినా, అడుగడుగునా క్లినిక్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. డాక్టర్లుగా చెలామణి అవుతూ మోసాలకు పాల్పడుతున్నారు. వచ్చీరాని వైద్య సేవలతో ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. ఈ తతంగం అంతా ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరుగుతున్నదని కాదు. సాక్షాత్తూ జిల్లా కేంద్రమైన ఖమ్మం నడిబొడ్డులో నిత్యం జరుగుతున్న దందా. ఎంబీబీఎస్ నుంచి మొదలుపెడితే స్పెషలిస్ట్ వైద్యుల వరకూ వీరందరికీ సమాంతరంగా నకిలీల రాజ్యం కొనసాగుతుండడం గమనార్హం. వీరిపై గతంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ ప్రాంతాలు మారుస్తూ, బోర్డులు తిప్పేస్తూ యథేచ్ఛగా తప్పుడు వైద్యాన్ని అందిస్తున్నారు. నగరంలోని అరవై డివిజన్ల పరిధిలో ఈ తరహా క్లినిక్‌లు అడుగడుగునా దర్శనమిస్తున్నాయి. ఉన్నతాధికారులు తనిఖీలకు సమాయత్తమవుతున్నారంటే చాలు.. క్షణాల్లో వీరికి సమాచారం చేరిపోతుండడం విశేషం.
తనిఖీల్లో విస్తుపోయే అంశాలు..
ఖమ్మం ట్రంక్ రోడ్డు ప్రాంతంలో వై.నరేశ్‌కుమార్ అనే వ్యక్తి ఆక్యూ పంచుర్ క్లినిక్ పేరుతో ఒక దవాఖాన తెరిచాడు. దానికి రిజిస్ట్రేషన్ లేదు. పైగా తన పేరుకు ముందు డాక్టర్ అని పెట్టుకున్నాడు. జనానికి వైద్య సేవలు అందిస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతిబాయి తన యంత్రాంగంతో కలిసి గురువారం ఆకస్మిక తనిఖీలకు వెళ్లారు. స్థానికంగా దర్శనమిచ్చిన అంశాలను గమనించిన ఆమె అవాక్కయ్యారు. న్యూరో ఫిజీషియన్ లేదా సర్జన్‌ను తలపించే రీతిలో నరాలు నొక్కి చికిత్స చేస్తానని, కాళ్లు, కీళ్లు, ఎముకల నొప్పులు తగ్గిస్తానని రోగులకు చెబుతూ తన వద్దకు రప్పించుకున్నాడు. ఇటీవలే కామేపల్లి మండలం పాత లింగాల గ్రామానికి చెందిన ఎం.శ్రీనివాస్ (53) అనే వ్యక్తి సదరు నకిలీ వైద్యుడి నిర్వాకానికి మృత్యువాత పడ్డట్లుగా తెలుసుకున్న డీఎంహెచ్‌వో.. ఈ నకిలీ వైద్యుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో పుట్టి తెలంగాణలోని పలు జిల్లాల్లో రోగులను మోసం చేసినట్లుగా నిర్ధారణ కావడంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా కోరారు. అనంతరం క్లినిక్‌ను సీజ్ చేయించారు. అదేవిధంగా ఎన్టీఆర్ సర్కిల్లో కేరళ వైద్యం పేరుతో వెలిసిన మరో క్లినిక్‌ను తనిఖీ చేసి మూసివేయించారు.
నకిలీ క్లినిక్‌లపై ప్రత్యేక దృష్టి : డీఎంహెచ్‌వో
జిల్లాలో కొందరు నకిలీ వైద్యులు.. ఆక్యూ పంచుర్, కేరళ వైద్యం, హెర్బల్, హోమియోపతి క్లినిక్‌లను ఏర్పాటు చేసుకుని తప్పుడు పద్ధతుల్లో వైద్యసేవలను కొనసాగిస్తున్నారని డీఎంహెచ్‌వో డాక్టర్ కళావతిబాయి అన్నారు. తనిఖీల సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎలాంటి అనుమతులు, అర్హతలు లేకుండా వెలుస్తున్న నకిలీ క్లినిక్‌లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. వైద్యం పేరుతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా సార్వజనీన ఆసుపత్రి(పెద్దాసుపత్రి)లోని ఎన్సీడీ క్లినిక్‌ను సందర్శించి అసంక్రమణ వ్యాధుల చికిత్స గురించి అటు వైద్యులను, ఇటు రోగులను అడిగి తెలుసుకున్నారు. మందులు, స్టోర్, ల్యాబ్‌ను పరిశీలించారు. కేటాయించిన స్టాఫ్ నర్సులు అక్కడే పనిచేసే విధంగా చూడాలని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్‌కుమార్‌కు సూచించారు. ప్రోగ్రాం అధికారులు డాక్టర్ చందునాయక్, డాక్టర్ రామారావు, డెమో సాంబశివారెడ్డి, ఎన్హెచ్ఎం డీపీవో దుర్గ, ఎన్సీడీ కో ఆర్డినేటర్ సత్యనారాయణ పాల్గొన్నారు.