రఘునాథపాలెం, జూలై 6 ; ఆర్టీవో ఆఫీస్ సేవలంటేనే ముందుగా వినిపించేది ఏజెంట్ల దోపిడీనే. ఇక్కడ ఇది వాహనదారులకు ఏళ్లుగా షరామామూలే అయినా.. మరో రకం దోపిడీకి ఆర్టీవో కార్యాలయం అడ్డా అయ్యింది. ఆన్లైన్ సర్వీస్ పేరిట ఇంటర్నెట్ సెంటర్లు వాహనదారులను మోసం చేస్తున్నాయి. సర్వీస్ చార్జి పేరిట ఇష్టానుసారంగా దండుకుంటున్నాయి. అనామతు చార్జీలు చేయాల్సిన నిర్వాహకులు వాహనదారుల నుంచి ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నారు.
ఖమ్మం జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయం ‘ఆన్లైన్’ సెంటర్లకు అడ్డాగా తయారైంది. ఆర్టీవో ఆఫీస్ ఎదుట అర్రులు చాచుక్కూర్చుంటున్న ‘ఆన్లైన్’ షాపు నిర్వాహకులు నిత్యం వాహనదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. కార్యాలయం పనుల నిమిత్తం వచ్చిన వాహనదారుల నుంచి ఆన్లైన్ సేవల పేరిట ఇష్టానుసారంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కో ఆన్లైన్ దరఖాస్తుపై రూ.50 నుంచి రూ.100 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌పై అవగాహన లేని వాహనదారులు నిర్వాహకులు అడిగినంత చేతిలో పెట్టి తదుపరి పనుల కోసం ఆర్టీవో కార్యాలయం బాట పడుతున్నారు. ఆర్టీవో ఆఫీస్ ఎదుట పదుల సంఖ్యలో ఆన్లైన్ షాపులు దర్శనమిస్తున్నాయంటే నిర్వాహకుల దందా ఏమేర కొనసాగుతుందో ఇట్టే అవగతం చేసుకోవచ్చు. గోరంత పనికి కొండంత వసూళ్లు చేస్తూ వాహనదారులను అడ్డంగా దోచుకుంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా క్యాష్‌లెస్ సేవలు
ఆర్టీవో ఆఫీస్‌లో అవినీతికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సర్కార్ క్యాష్‌లెస్ సేవలకు శ్రీకారం చుట్టింది. రవాణా శాఖ ఆఫీస్‌కు చెందిన ఏ పనులు పొందాలన్నా వాహనదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని సంబంధిత పత్రాలను తీసుకొచ్చి కార్యాలయంలో చూపిస్తే చాలు.. సిబ్బంది, అధికారులు వాటిని పరిశీలించి నగదు రహిత సేవలను అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన క్యాష్‌లెస్ సేవల విధానం ఆన్లైన్ సెంటర్లకు అందివచ్చిన ఆవకాశంగా మారింది. ఆర్టీవో ఆఫీస్‌లో జరిగే నగదు రహిత సేవలను ఆన్లైన్ సెంటర్లు క్యాష్ చేసుకుంటున్నాయి. జిరాక్స్, పాన్‌కార్డులు, లామినేషన్, ఆర్టీఏ ఆన్లైన్ సేవల పేరుతో సెంటర్లను ఏర్పాటు చేసుకొని వాహనదారులను అడ్డంగా దోచుకుంటున్నాయి.
ఈ దోపిడీపై దృష్టి సారించి అడ్డుకట్ట వేయాల్సిన సంబంధిత అధికారులు తమకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో ఆన్లైన్ సెంటర్ల నిర్వాహకులు మరింతగా రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. ఒక్క పనిని రెండుసార్లు చేస్తూ డబుల్ డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు వాహనదారులు మొత్తుకుంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. అంతేనంటూ సమాధానం చెబుతున్నారని వాపోతున్నారు. పనులు మానుకొని రవాణా శాఖ కార్యాలయంలో పనుల కోసం వచ్చిన వాహనదారులు ఆన్లైన్ సెంటర్ల ఇష్టానుసార వసూళ్లను ప్రశ్నించలేకపోతున్నట్లు తెలుస్తోంది. అంతెందుకు సేవలపై సలహాల కోసం ఆఫీస్ బయట ఉన్న ఆన్లైన్ సెంటర్లకు వెళ్లినా.. కంప్యూటర్లో చూసినందుకే సర్వీస్ చార్జీ పేరుతో భారీగా వసూలు చేస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఆర్టీవో ఆఫీస్ బయట వాహనదారులను నిలువు దోపిడీ చేస్తున్న ఆన్లైన్ షాపు నిర్వాహకుల వ్యాపారం ‘మూడు పువ్వులు.. ఆరు కాయలు’ అనే చందంగా కొనసాగుతోంది. దీనిపై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించి ఆన్లైన్ సెంటర్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని వాహనదారులు కోరుతున్నారు.