ఇల్లెందు రూరల్, జూన్ 16:ఇల్లెందు ప్రభుత్వాసుపత్రిలోని డయాలసిస్ రోగుల ఆరోగ్య పరిస్థితి ‘దినదిన గండం’ అన్నట్లుగా ఉంటోంది. పది రోజుల కిత్రం నాటి ఉరుములు, మెరుపుల వల్ల షార్ట్‌సర్క్యూట్ జరిగి డయాలసిస్ కేంద్రంలోని యంత్రం దెబ్బతిన్నది. అందులోని ఎస్అండ్పీసీ బోర్డు కాయిల్స్ కాలిపోయాయి. ఫలితంగా వారం, పది రోజులుగా ఈ ఆసుపత్రిలో డయాలసిస్ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ప్రతి రోజూ వచ్చే 20 నుంచి 30 మంది డయాలసిస్ రోగులకు ప్రాణసంకట పరిస్థితి ఏర్పడింది. దీంతో దిక్కుతోచని స్థితిలో పొరుగున ఉన్న పట్టణాలకు వెళ్తున్నారు. అదీగాక మూడు నాలుగు రోగులకు ఒకసారి రక్తశుద్ధి చేసుకోవాల్సిన రోగులైతే మరో ఇద్దరు సహాయకులను తీసుకొని వెళ్లాల్సి వస్తోంది.
ఇల్లెందు ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ చేయించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచి రోజుకు 20 నుంచి 30 మంది వరకూ రోగులు వస్తుంటారు. ఇక్కడ డయాలసిస్ ప్రక్రియ నిలిచిపోవడంతో వారంతా వ్యయప్రయాలకు, అనారోగ్య పరిస్థితులకు ఓర్చి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఆసుపత్రి అంతా అధిక భాగం ఇనుముతో నిర్మాణం జరగడంతో వర్షాకాలంలో దీనిలో తరచూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సమస్య ఏర్పడుతోంది. అంతకుమునుపు కూడా షార్ట్‌సర్క్యూట్ జరగడంతో మంటలు వ్యాపించి ఆసుపత్రి సగానికి పైగా కాలిపోయిన విషయం విదితమే. వారం, పది రోజుల క్రితం వర్షం వచ్చిన సమయంలో మెరుపులు, పిడుగుల వల్ల డయాలసిస్ యంత్రం దెబ్బతిన్నది. మెషీన్‌లోని ఎస్అండ్పీసీ బోర్డులోని మొత్తం ఐదు కాయిల్స్ కాలిపోవంతో డయాలసిస్ ప్రక్రియ నిలిచిపోయింది. ఒక్కో కాయిల్‌కు రూ.35 వేల వరకూ ఉంటుందని, మొత్తం ఐదు కాయిల్స్‌కు రూ.2 లక్షల వరకూ ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఢిల్లీకి చెందిన డీసీడీసీ కాంట్రాక్టు కంపెనీ బాధ్యులు 12 రాష్ర్టాల్లో డయాలసిస్ యంత్రాల మరమ్మతులు చేపడుతుంటారు. ఇల్లెందు ఆసుపత్రి యంత్రం నిర్వహణను కూడా వారే పర్యవేక్షిస్తుంటారు. అయితే వారు రావాలంటే మరో మూడు, నాలుగు రోజులు పడుతుందని ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. కానీ ఇప్పటికే పది రోజులుగా ప్రక్రియ నిలిచిపోవడంతో ఇక్కడికి వచ్చే డయాలసిస్ రోగులను అశ్వారావుపేట, కొత్తగూడెం, ఖమ్మం, మణుగూరు, మహబూబాబాద్ తదితర ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిస్తున్నారు.
ఒక డయాలసిస్ రోగిని తీసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లి ప్రక్రియను పూర్తి చేయించుకుని రావాలంటే ఎన్నో వ్యయప్రయాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. సమయం కూడా అధికంగా వెచ్చించాల్సి వస్తోంది. దీంతో తమకు ఈ అవస్థలు తప్పాలంటే అధికారులు వెంటనే ఇక్కడ ప్రక్రియను పునరుద్ధరించాలని డయాలసిస్ రోగులు వేడుకుంటున్నారు.
ఇల్లెందు ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఎంతో సంబుర పడ్డా. వారంలో రెండుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి నాది. ఇక్కడ డయాలసిస్ కేంద్రం ఉండడంతో ఇప్పటి వరకూ అంతా సాఫీగా సాగింది. కానీ వారం రోజుల క్రితం యంత్రంలో ఎస్అండ్పీసీ బోర్డు కాయిల్స్ కాలిపోయాయని, దీంతో డయాలసిస్ ప్రక్రియ నిలిచిపోయిందని ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. దీంతో నా పరిస్థితి ఆందోళనగా ఉంటోంది.
మూడు రోజులకు ఒకసారి చొప్పున డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి నాది. కొద్ది నెలలుగా నేను ప్రతిసారీ ఇల్లెందుకు వచ్చి డయాలసిస్ చేయించుకొని వెళ్తున్నాను. కానీ వారం పది రోజులుగా ఇక్కడ డయాలసిస్ చేయడం లేదు. యంత్రాలు దెబ్బతిన్నాయని చెప్పి అధికారులు ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారు. కచ్చితంగా నిర్ణీత సమయంలోగా నేను డయాలసిస్ చేయించుకోకపోతే నా శరీర వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ క్రమంలో మరో ఇద్దరి సహాయంతో వేరే ప్రాంతానికి వెళ్లి డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది.
ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే డయాలసిస్ రోగులు అధైర్యపడొద్దు. మంగళవారం నాటికి డయాలసిస్ కేంద్రంలోని యంత్రాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడి సమస్యను ఇప్పటికే జిల్లా వైద్యాధికారులకు తెలియజేశాం. వారు డీసీడీసీ కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులకు సంప్రదించారు. 12 రాష్ర్టాల్లో ఈ కంపెనీ ప్రతినిధులే డయాలసిస్ మిషన్లకు మరమ్మతులు చేస్తుంటారు. వారు త్వరలోనే వచ్చి డయాలసిస్ రోగులకు ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తారు.