కారేపల్లి, మార్చి 28 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల సోసైటీలో రైతు సేవలను విస్తరించడం జరుగుతుందని సోసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం సంఘ కార్యాలయంలో మహాజన సభ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంఘం మండలంలోని 41 గ్రామ పంచాయతీల పరిధిలో 6,677 మంది సభ్యులతో విస్తరించి ఉందన్నారు. సంఘంలో 3,301 రైతులకు రూ. 19.45 కోట్లు రుణాలు అందించినట్లు తెలిపారు. రైతులు తమ పంట రుణాలను రెన్యూవల్ చేసుకోవాలని, దాని ద్వారా 3 శాతం కేంద్ర ప్రభుత్వం రాయితీ వస్తుందన్నారు. సకాలంలో రెన్యూవల్ చేయించుకోని వారికి వడ్డీ రాయితీ రాక పోగా 13 శాతం వడ్డీతో పాటు చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు.
సంఘంలో 3,792 మందికి రూ.19.45 కోట్ల రుణమాఫీకి ప్రభుత్వానికి ప్రతిపాధనలు పంపితే కేవలం 1,459 మందికి మాత్రమే రూ.5.50 కోట్లు 38 శాతం మందికి మాత్రమే మాఫీ జరిగిందని తెలిపారు. గతేడాది సంఘం పరపతి, పరపతేతర వ్యాపారాల ద్వారా రూ.39.25 లక్షలు లాభం ఆర్జించిదన్నారు. సంఘం పరిపాలన భవనంకు అదనపు గదులు, సంఘం ఆవరణలో డీసీసీబీ బ్రాంచ్ నూతన భవన నిర్మాణానికి మహాజన సభ తీర్మానించింది. ఈ కార్యక్రమంలో సోసైటి ఉపాధ్యక్షుడు దారావత్ మంగీలాల్, సీనియర్ ఇన్స్పెక్టర్ ఎం.సత్యనారాయణరెడ్డి, డీసీసీబీ సూపర్వైజర్ కొంగర వేణు, కార్యదర్శి బొల్లు హనుమంతరావు, డైరక్టర్లు అడ్డగోడ ఐలయ్య, బానోత్ హీరాలాల్, ఎల్లంకి పాప, కొత్తూరి రామారావు, డేగల ఉపేందర్ పాల్గొన్నారు.