జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 50 రోజులపాటు సర్వేయర్‌గా శిక్షణ పొందిన అభ్యర్థులకు ఈ నెల 27వ తేదీ నుంచి మూడు రోజులపాటు తుది పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే శిక్షణ పొందని అభ్యర్థులకు సైతం అధికారులు హాల్‌టికెట్లు జారీ చేశారు.
తుది పరీక్షలకు హాజరుకావాలంటే 90శాతం తరగతి గది శిక్షణ, 70 శాతం అంతర్గతంగా నిర్వహించే పరీక్షల్లో మార్కులు వచ్చి ఉండటంతోపాటు ఫీల్డ్‌వర్క్, ప్రాక్టికల్స్, ప్లాటింగ్ రికార్డులు తప్పనిసరి. కానీ.. ఈ నిబంధనలేమీ చూడకుండానే ఒక్కరోజు కూడా శిక్షణకు హాజరుకాని అభ్యర్థులకు హాల్‌టికెట్లు జారీ చేయడంతో శిక్షణ పొందిన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం.. 50రోజులపాటు శిక్షణ పూర్తిచేసిన తమకు అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు. శిక్షణకు హాజరుకాని వారిని పరీక్షలకు అనుతించవద్దని డిమాండ్ చేస్తున్నారు.
– మామిళ్లగూడెం, జూలై 26
రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం అమలులో భాగంగా గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి అవసరమైన లైసెన్స్ సర్వేయర్లను నియమించేందుకు ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. బీటెక్, ఐటీఐ సివిల్, పాలిటెక్నిక్ డిప్లొమా వంటి కోర్సులు అభ్యసించిన వారికి మెరిట్, రిజర్వేషన్ ప్రకారం అవకాశం కల్పించారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన వారిని లైసెన్స్ సర్వేయర్లుగా గుర్తించి గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
గత మే 26వ తేదీ నుంచి 50 రోజులపాటు శిక్షణ అందించగా.. అభ్యర్థులు విజయవంతంగా పూర్తిచేశారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 647 మంది దరఖాస్తు చేసుకోగా.. 588 మందిని శిక్షణకు ఎంపిక చేశారు. వీరికి ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల, టీటీడీసీలో శిక్షణ ఇచ్చారు. అయితే రోజువారీ శిక్షణకు 450 మంది మాత్రమే హాజరయ్యారు. కానీ.. అధికారులు శిక్షణకు హాజరుకాని 138 మందికి సైతం నిబంధనలకు విరుద్ధంగా హాల్‌టికెట్లు జారీ చేశారు. దీంతో రెగ్యులర్ అభ్యర్థులు స్వయంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలిసి అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
నేటి నుంచి తుది పరీక్షలు…
సర్వేయర్లుగా శిక్షణ పొందిన అభ్యర్థులకు ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 27వ తేదీ ఆదివారం నుంచి మూడ్రోజులపాటు తుది పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో థియరీ, ప్రాక్టికల్స్, క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్స్ ఉంటాయి. పరీక్షలు ముగిసిన తరువాత ఆగస్టు 4వ తేదీ నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు 40 పనిదినాల్లో ఆయా మండలాల్లో ప్రభుత్వ సర్వేయర్ పర్యవేక్షణలో అప్రెంటీస్ శిక్షణ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ శిక్షణ సమయంలో క్షేత్రస్థాయిలో సర్వేనెంబర్ల గుర్తింపు, డిమార్కేషన్, సబ్ డివిజన్, రిజిస్టర్లు, ఫైల్స్ నిర్వహణ వంటి సర్వేయర్‌గా నిర్వహించాల్సిన బాధ్యతలపై శిక్షణ అందించనున్నారు. విజయవంతంగా అప్రెంటీస్ పూర్తిచేసిన వారికి లైసెన్స్ సర్వేయర్‌గా గుర్తింపును ఇస్తూ ధ్రువీకరణ పత్రం జారీ చేయనున్నారు.