కారేపల్లి, మే 14 : అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ శాసనసభ్యుడు మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. బుధవారం సింగరేణి మండల పరిధిలోని కొత్తతండా గ్రామంలో 63 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందిన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..వివిధ రకాల సాంకేతిక కారణాల వల్ల పలువురి రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరుగలేదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరేలా కృషి చేస్తానని తెలిపారు.
వైరా నియోజకవర్గ వ్యాప్తంగా 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు చెప్పారు. కారేపల్లి, కొణిజర్ల, వైరా ఏన్కూరు, జూలూరుపాడు మండలాల్లో మొదటి విడుత మంజూరైన ఇండ్ల నిర్మాణాలు వివిధ దశలో ఉన్నట్లు వెల్లడించారు. అంతకుముందు కొత్తతండాలో గల ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ డీఈ సాయిరాం రెడ్డి, ఎంపీడీఓ సురేందర్, డిప్యూటీ తాసీల్దార్ కృష్ణయ్య, ఎంపీఓ రవీంద్రప్రసాద్, ఐకేపీ ఏబీఎన్ పిడమర్తి వెంకటేశ్వర్లు, మండల వ్యవసాయ శాఖ అధికారి బట్టు అశోక్ కుమార్, విద్యుత్ శాఖ ఏఈ సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.