Singareni | ఇల్లెందు, అక్టోబర్ 28 : సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్ఐ వైద్య సేవలపై ఇల్లెందులో ఐసీఓఏ క్లబ్లో ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ల, కాంట్రాక్ట్ కార్మికుల ఈఎస్ఐ వైద్య సేవల కొరకు నిర్వహించే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏరియా జీఎం వి.కృష్ణయ్య లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల పాలిట ఈఎస్ఐ వైద్య సేవలు ఒక వరం లాంటిదని, బహుళ ప్రయోజనకరం అని, కాంట్రాక్ట్ కార్మికులకు ఎంతగానో లబ్ది చేకూర్చుతుందని చెప్పారు. ఈ పథకం అమలుకు కృషిచేసిన సింగరేణి సి ఎండి బలరాం నాయక్ కృషి ప్రశంసనీయమని ఇల్లందు ఏరియా జీఎం కృష్ణయ్య పేర్కొన్నారు. వైద్యం ఈనాడు ఎంతో ఖర్చుతో కూడుకున్నదని, ఇలాంటి సమయంలో కాంట్రాక్ట్ కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులకు వర్తించే విధంగా మెరుగైన వైద్య సదుపాయాలు, అనేక సంక్షేమ పథకాలు ఈఎస్ఐలో ఉన్నాయని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు మెడికల్ కాలేజీల్లో సీట్ల ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో మంచి అంశమని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఇది బహుళ ప్రయోజనకర పథకం కావున ప్రతి కాంట్రాక్టర్ తమ కార్మికులను తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు.
ఈఎస్ఐ ఖమ్మం బ్రాంచ్ మెనేజర్ సాయి కుమార్ మాట్లాడుతూ, ఈఎస్ఐ వైద్య సేవల ప్రయోజనాలను వివరించారు. బీమా చేయబడిన కార్మికులు, వారి కుటుంబాలకు వివిధ రకాల వైద్య సేవలను అందిస్తుందని తెలిపారు. అవుట్ పేషంట్ చికిత్సలో సాధారణ వైద్య సంప్రదింపులు, చికిత్స, మందులు, నిపుణుల సంప్రదింపులు, ఆసుపత్రి చేరిక సేవలు ఉంటాయని చెప్పారు. ఇన్ పేషంట్ సేవలు, నిపుణుల సేవలు, మందులు, ఇంజెక్షన్లు ఉచితంగా లభిస్తాయని, ఆయుష్ వైద్య పద్ధతులు కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) ఐవీ ఏ వరప్రసాద్ కార్పొరేట్, డీజీఎం పర్సనల్ అజీర తుకారాం, డీజీఎం (సివిల్) రవికుమార్, ఏరియా సెక్యూరిటీ అధికారి అంజి రెడ్డి, డీఐ (పి.యం) శ్యాం ప్రసాద్, సంక్షేమ అధికారి ఇక్బాల్ షరీఫ్, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి నజీర్ అహ్మద్, ప్రాతినిధ్య సంఘం ఉపాధ్యక్షులు జే.వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, క్లార్క్స్ కాంట్రాక్టర్ల, కాంట్రాక్ట్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.