పాల్వంచ, ఏప్రిల్ 11 : విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన నాల్గవ రోజు సమ్మె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ వద్ద ఉద్రిక్తంగా మారింది. ఆర్టిజన్ జాక్ నాయకుల పిలుపు మేరకు చేపట్టిన ‘చలో కేటీపీఎస్’ కార్యక్రమం శనివారం నిర్బంధాల మధ్య కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి పాల్వంచ బాట పట్టిన కార్మికులను జెన్కో యాజమాన్యం ఆదేశాల మేరకు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. సమీప పోలీస్స్టేషన్లకు తరలించారు. అయినా కొందరు కార్మికులు తప్పించుకుని సమ్మె శిబిరం వద్దకు చేరుకున్నారు. తోటి కార్మికులతో కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పలు కార్మిక సంఘాల నాయకులు సమ్మె చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని టీజీ జెన్కో, ఎన్పీడీసీఎల్ కార్యాలయాల వద్ద ఆర్టిజన్ కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్టిజన్ జాక్ నాయకుల పిలుపు మేరకు వివిధ కర్మాగారాలు, టీజీ జెన్కో, ఎన్పీడీసీఎల్లో పనిచేస్తున్న కార్మికులు వివిధ వాహనాల్లో ‘చలో కేటీపీఎస్’ బాట పట్టారు. దీంతో జెన్కో యాజమాన్యం వీరిపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసుల సహకారంతో వంద మందికి పైగా కార్మికులను పాల్వంచ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీ కాలనీ గేట్ వద్ద అరెస్టు చేసిన కార్మికులను పోలీస్‌స్టేషన్‌కు తరలించగా, కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో ఆ మార్గం గుండా వెళ్తున్న వారిని కూడా అరెస్టు చేసి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
శాస్త్రీ రోడ్ నుంచి మార్కెట్ మీదుగా కాలనీకి వెళ్లే గేటు నుంచి వెళ్తున్న కొందరు కార్మికులను అరెస్టు చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. తర్వాత కాలనీ గేటుకు ఎస్పీఎఫ్ సిబ్బంది తాత్కాలికంగా తాళాలు వేశారు. అయినా వాటిని లెక్క చేయకుండా ఆటోలు, వివిధ మార్గాల ద్వారా కార్మికులు సమ్మె శిబిరం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంటుందనే ఉద్దేశంతో కేటీపీఎస్ జెన్కో యాజమాన్యం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఆ ప్రాంతంలో పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది భారీగా మోహరించారు. డీఎస్పీ సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు.
5, 6 దశల సీఈ ప్రభాకర్‌రావు అక్కడే ఉండి పరిస్థితి గురించి యాజమాన్యానికి తెలియజేశారు. కాగా, సమ్మె శిబిరాన్ని పలువురు కార్మిక నేతలు సందర్శించి సంఘీభావం తెలిపారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రధాన కార్మిక సంఘాల నేతలు యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి సమ్మె శిబిరం వద్దకు చేరుకున్న కార్మికులకు స్థానిక ఆర్టిజన్లు భోజన వసతి ఏర్పాట్లు చేశారు. అయితే ఎండను సైతం లెక్క చేయకుండా ఇంత పెద్ద ఎత్తున కార్మికులు పాల్వంచ తరలిరావడం కేటీపీఎస్ చరిత్రలోనే ఇది తొలిసారి.
ఇల్లెందు, ఏప్రిల్ 11 : సీఐటీయూ ఆధ్వర్యంలో ‘చలో కేటీపీఎస్’ కార్యక్రమానికి వెళ్తున్న ఆర్టిజన్ కార్మికులను ఇల్లెందు పోలీసులు శనివారం అడ్డుకొని అరెస్టు చేశారు. దాదాపు 60 మంది కార్మికులను ఇల్లెందు నుంచి గుండాల, అటు నుంచి కాచనపల్లి పోలీస్స్టేషన్లకు తరలించారు. సాయంత్రం 6 గంటల తర్వాత విడిచిపెట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు అబ్దుల్ నబీ, తాళ్లూరి కృష్ణలు మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో కేటీపీఎస్ వద్ద కార్మికులు చేపట్టిన సమ్మె వద్దకు వెళ్తున్న వారిని మధ్యలోనే అడ్డుకొని అరెస్టు చేయడం సరికాదన్నారు. కార్మికులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
మధిర, ఏప్రిల్ 11 : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్టిజన్, అన్-మ్యాన్డ్, పీస్ రేట్ కార్మికులు మధిర విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట చేపట్టిన సమ్మె శనివారం నాల్గవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా సబ్ స్టేషన్ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఆఫీస్ అసిస్టెంట్లు, వాచ్మెన్లుగా వివిధ రూపాల్లో విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏళ్లతరబడి పని చేస్తున్నా తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. యాజమాన్యం వెంటనే స్పందించి చర్చలు జరిపి, తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. దీక్షా శిబిరంలో పలువురు కార్మికులు పాల్గొన్నారు.
లక్ష్మీదేవిపల్లి, ఏప్రిల్ 11 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ ఎదుట దీక్షలు చేపట్టిన ఆర్టిజన్ కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న సుమారు 60 మందిని లక్ష్మీదేవిపల్లి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వివిధ విద్యుత్ ప్లాంట్లలో పనిచేస్తున్న కార్మికులు రెండు బస్సుల్లో కొత్తగూడెం మీదుగా పాల్వంచ వెళ్తున్నారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న ఎస్సై రమణారెడ్డి ఆ బస్సులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పలువురు ఆర్టిజన్లు మాట్లాడుతూ శాంతియుత మార్గంలో ఆందోళన చేస్తున్న ఆర్టిజన్లకు మద్దతు తెలిపేందుకు వస్తున్న తమను పోలీసులు మధ్యలోనే అదుపులోకి తీసుకోవడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేదంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. కార్మికుల ప్రధాన డిమాండ్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం మొండివైఖరి వీడాలి. తక్షణమే సమస్యలను పరిష్కరించి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. లేకపోతే మరింత ఉధృతంగా సమ్మె చేస్తాం. అన్ని పార్టీల మద్దతు తీసుకుని ముందుకు వెళతాం.
-ఎం.నరేశ్, సూర్యాపేట, ఆర్టిజన్ కార్మికుడు
మా డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్ నుంచి పాల్వంచ కేటీపీఎస్కు వచ్చాం. ఎండను కూడా లెక్క చేయలేదు. తోటి కార్మికులతో కలిసి సమ్మెలో పాల్గొనేందుకు వస్తుంటే మమ్మల్ని మధ్యలోనే అడ్డుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయినా కూడా అందరి సహకారంతో మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం.
-సుధాకర్, పటాన్చెరు, హైదరాబాద్
ఆర్టిజన్ కార్మికుల ప్రధాన సమస్యపై ప్రభు త్వం తక్షణమే స్పందించాలి. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం దురదృష్టకరం. సమ్మెకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న తమను అక్రమంగా అరెస్టు చేయడం ప్రభుత్వ వైఖరికి నిలువెత్తు నిదర్శనం.
-ఈ.శ్యాం, ఆర్టిజన్ కార్మికుడు, నల్లగొండ
శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆర్టిజన్ల సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించి ఆర్టిజన్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.
-స్వామిదాస్, ఆర్టిజన్ కార్మికుడు, సిద్దిపేట